నా స్కూల్‌మేట్ గూగుల్ షేర్స్ కొన్నాడు... నేను బాధపడితే ఎలా: డి.సురేష్ ఇంటర్వ్యూ
సినిమా అనేది వ్యాపారం. ఈ రంగంలోకి రావాలంటే వ్యక్తిగత ఇంట్రెస్ట్‌తోనే వస్తుంటారు. ఇందులో గెలిచినా ఓడినా బాధ్యుడు తనే. ఎవరివల్లో నష్టపోయాడనే నింద వేయడం సరికాదు. మన తెలుగు సినిమాల్లో క్రియేటివిటీ అనేది లోపిస్తుంది. కథలన్నీ ఒకే మూసలోనే ఉంటున్నాయి. అందుకే జాతీయస్థాయి పోటీకి వెళ్ళలేకపోతున్నాయని... ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తెలియజేస్తున్నారు. ఆయన నిర్మాతగా వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన సినిమా 'దృశ్యం'. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురేష్‌బాబు పలు విషయాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు.
ఇప్పటి సినీ ట్రెండ్ ఎలా ఉంది...?
చిన్నవారి సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నతనంలో నాన్నగారు, కె. రాఘవేంద్రరావు సినిమాలు తీస్తున్న సమయంలో... సీనియర్ దర్శకులు కె.ఎస్.ప్రకాశరావు, రాజేశ్వరావు, ఆత్రేయ వంటివారు కూర్చుని కథ గురించి చర్చించుకుంటుంటే.. ఇంకా ఈ వయస్సులో తీయాలా అంటూ కామెంట్లు చేశారు. అప్పట్లో నాన్నగారు యువకుడు. రేపు ఆ పరిస్థితి మనకు రాకూడదనే స్టూడియో నిర్మాణాలు, ఫిలిం స్కూల్స్ పెట్టి.. కొత్తవారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటి జనరేషన్ కూడా చాలా మార్పు చెందింది. ఒకప్పటి గౌరవాలు లేవు. అయినా వారితో కలిసి ప్రయాణం చేయాలి.
దృశ్యం ఆలస్యమైనట్లుంది...?
మలయాళం 'దృశ్యం' చూశాను. అందులో పదహారేళ్ళ అమ్మాయి తండ్రిగా చేయాలని వెంకటేష్‌ను బయట నిర్మాత అడగాలంటే భయపడేవాడు. కథ చాలా బాగుంది. అదే మా బేనర్లో చేయాలనుకున్నాం. ఆ రైట్స్ రాజ్‌కుమార్‌గారి దగ్గర ఉన్నాయి. ఇద్దరం కలిసి చేయాలనుకున్నాం. షూటింగ్ కంటెన్యూగా చేయాలనుకున్నాం. సీసీఎల్ వచ్చింది. బ్రేక్ పడింది. అది లేకపోతే ఇంకాస్త ముందే విడుదలయ్యేది.
దర్శకత్వం ఆలోచన ఉందా...?
దర్శకత్వం చేయాలనే ఆలోచన ఒకొక్కక్కప్పుడు వస్తుంటుంది. నాకున్న వ్యాపార ఒత్తిడి వల్ల సాధ్యపడదు. అందుకే దాని జోలికి పోను. కానీ దాదాపు నా సినిమాలన్నీ చాలా సీన్స్ నేనే డైరెక్ట్ చేస్తాను. కొన్ని సీన్లలో నా ముద్ర ఉంటుంది. ఏది ఏమైనా క్రియేటివ్ నిర్మాతగా ఉండాలనుకుంటాను. దర్శకుడిగా నా పేరు ఉండాలనే ఆశ లేదు. కనీసం నిర్మాతగా డి.సురేష్ బాబు అని కూడా వేయించను. లైఫ్ లివింగ్ కూడా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతాను. మందీమార్బలం చుట్టూ ఉండాలని నేను అనుకోను.
ఇవన్నీ ఎలా సాధ్యం..
ఇవన్నీ ఇండస్ట్రీలో సీనియర్స్ నుంచి నేర్చుకున్నాను. ఒకప్పుడు వాహినీ స్టూడియో, భరణి చాలా ఉండేవి. మొన్నీమద్యనే ఏవీఎం స్టూడియోకు వెళితే... చుట్టూ నాలుగు గోడలు ఉన్నాయి. చాలా బాధేసింది. భవిష్యత్‌లో నాకు అలా జరుగకూడదనిపించింది.
హైదరాబాద్‌లో రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోలు ఉన్నాయి. సారథిని నైజీరియా వ్యాపారి కొనేశారు. కొద్దిరోజుల్లో కమర్షియల్‌గా మార్చేస్తాడు. అందుకే మనకు ఉన్నంతకాలం స్టూడియోలు రన్ చేయాలి. నలుగురికి పని కల్పించాలి. నానక్‌రామ్‌గూడలో అమ్మాయి పెళ్లి తర్వాత షాదీఖాన కడదామనుకున్నాను. కానీ గోపాల గోపాల.. వంటి సినిమాలకు లొకేషన్లు దొరక్కపోవడంతో... దాన్ని అలాగే ఉంచాను. ఇప్పుడు అక్కడ కోర్టు సెట్, మధ్యతరగతి ఫ్యామిలీ సెట్లు వేశాం.
ఎఫ్డిసి స్థలం కేసు గురించి...
ఇండస్ట్రీకి ఇచ్చిన భూమిని 20 ఏళ్ళుగా నిరుపయోగంగా ఉంచారు. అక్కడ చిల్డ్రన్ ఫిలిం సొసైటీ బిల్డింగ్ కట్టాలని సెంట్రల్, స్టేట్ ప్రభుత్వాలకు చెప్పాం. ఎఫ్డిసీకీ రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత లేకపోవడంతో అలా ఏళ్లు గడిచాయి. ఏదైనా స్టూడియోలో కట్టి డబ్బు సంపాదించాలనేది కరెక్ట్ కాదు. ఈ రంగంలోనే ఉండి... ఇక్కడే కష్టపడి దానితో స్టూడియోగా మార్చారు పెద్దలు. అది ఏ స్టూడియో అయినా కానీండి. నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ తీస్తూ కట్టారు.
బ్యాంక్‌లో అప్పు తెస్తే ఇంతేసంగతులు. ఇది ఎవరి వ్యాపారం ఇంట్రెస్ట్ వారిది. ఒకప్పుడు బొంబాయిలో స్టూడియో చాలా వరష్ట్గా ఉండేవి. మెహబూబాబ స్టూడియో ఉన్న గల్లీ చాలా అశుభ్రంగా ఉండేది. ఇక్కడేనా నేను పని చేయాల్సివచ్చేది అని మధనపడేవాడిని. ఎలాగైనా స్టూడియో కట్టాలన్న ఆలోచనతోనే నాన్నగారి ప్రోత్సాహంతోనే హైదరాబాద్‌లో కట్టాం.
స్టూడియోల్లో ఇప్పుడు సినిమాల షూటింగ్ జరుగడంలేదు. 150 సినిమాల్లో 125 సినిమాలో ఔట్‌డోర్ లోనే జరుగుతున్నాయి. మిగిలినవి రోడ్డు మీద సీన్స్ స్టూడియోలో చేసేస్తున్నారు. టీవీ షోస్ లేకపోతే స్టూడియోలకు మనుగడ కష్టంగా ఉండేవి.
ఇతర భాషల్లో హీరోల మార్కెటింగ్ ఎలా ఉంది...?
ముంబై హీరోల మార్కెట్ చాలా పెద్దది. ఆ సినిమాలు ఎక్కడైనా ఆడుతాయి. మన సినిమాలు వాటి కంటే పెద్దవికావు. మన మార్కెట్‌ను విస్తృతపర్చాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. తమిళంలో శంకర్ లాగా తెలుగులో రాజమౌళి గొప్ప దర్శకుడు. తమిళంలో కథలు కూడా మూలాల్లోంచి పుడతాయి. తెలుగులో అలాకాదు. ఏవో ఒకటి రెండు చిత్రాలు వస్తాయి. ఉయ్యాల జంపాల.. చిత్రం అమలాపురంలో తీశాం. అక్కడ గ్రామాల్లోని కల్చర్‌ను తీసుకున్నాం. హిందీ, మలయాళం, తమిళం ఏదైనా ఆ మూలాల్లోంచి రచయితలు కథలు రాస్తుంటారు. మన సినిమాల్లో అవి లోపించాయి. అందుకే జాతీయస్థాయికి చిత్రాలు చేరుకోలేకపోతున్నాయి.
నిర్మాతకు హాలీవుడ్ రేంజ్లో సినిమా తీయాలని, దర్శకుడిగా 100 కోట్ల చిత్రం తీయాలనీ, నటుడిగా కేరళ, చైనా మార్కెట్‌ను క్యాచ్ చేయాలనే గోల్ ఉండాలి. అప్పుడే మార్కెట్ విస్తరిస్తుంది. ఇక్కడ చాలా ఏనిమేషన్ కంపెనీలున్నాయి. కానీ స్కిల్ లేదు. ఇంగ్లీషు సినిమా చేసేంత బలమూలేదు.
థియేటర్ల సమస్య గురించి...
థియేటర్లు అనేవి జాతీయస్థాయిలో ఉన్న సమస్య. అక్కడా నలుగైరుదురు చేతుల్లోనే ఉంటుంది. ఒక్కో పండగకు ఒక్కో అగ్రహీరో చిత్రాలు విడుదలవుతుంటాయి. ఆ మధ్యకాలంలో చిన్నచిత్రాలు వస్తుంటాయి. ఇది ఒక్క తెలుగులోనే కాదు. ఈ వ్యాపారం ఎక్కువగా వీకెండ్ డేస్‌గా మారిపోయింది. బాలీవుడ్లో ఆ కల్చర్ ఎక్కువయింది. అదే ఇక్కడికి వచ్చింది. ఇదేం కొత్తది కాదు. అక్కడ మేకింగ్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. సినిమాకు ఫస్ట్ ఎ.డి. ఉంటారు.
ఆయన చెప్పిందే దర్శకుడు వినాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితిలేదు.
అంతా రివర్స్‌లో జరుగుతుంది. ఆ పరిస్థితి మారాలి. అది మారాలంటే... క్రియేటివిటీ ఉన్న చిత్రాలు రావాలి. హీరోల రెమ్యునరేషన్ సమస్య అక్కడా ఉంది. అందుకే అక్కడ జురాసిక్ పార్క్, హీమాన్, బ్యాట్‌మాన్ అనే సినిమాలు వస్తుంటాయి. తెలుగులో ఈగ వచ్చింది. ఇలా క్రియేటివిటీతో సినిమాలు తీయాలి.
ప్రేక్షకుడిని మెప్పించేందుకు...
ఏ సినిమా అయినా పది నిముషాల్లో కథలో ప్రేక్షకుడు మమేకం కావాలి. అది కామెడీ కానీ కథకానీ, సీన్ కానీ.. ఎమోషన్ కానీ.. కనెక్ట్ అయితేనే రక్తికడుతుంది. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. అవన్నీ ఉన్న చిత్రం 'దృశ్యం'. సింపుల్ స్టోరీ. ప్రతి ఇంట్లో ఇలా జరుగవచ్చు అనిపిస్తుంది. జరిగితే ఈ హీరో లాగే చేయాలనిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత కథల్లో మార్పు తప్పకుండా వస్తుంది. విజయనగరం, అరకు మధ్యలో ఉండే గ్రామంలో కేబుల్ ఆపరేటర్ రాంబాబు. వీడియోల్లో సినిమాలు చూసి పరిణతి చెందుతాడు. ఇంటిలో ఓ సమస్య వస్తే దాన్ని తను చూసిన సినిమాలో మాదిరిగానే పరిష్కరించుకుంటాడు. అది ఇంట్రెస్ట్‌గా ఉంటుంది.
ఇటీవలే 70 మందికి సినిమా చూపించాను. అందరూ మెచ్చుకున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్ననే సెన్సార్ అయింది. సభ్యులు చూసి తెగ పొగిడేశారు. మేమే పిచ్చి సినిమాలు చూడలేక ఛస్తున్నాం. ఇలాంటి మంచి సినిమాలు తీయండని భుజం తట్టారు.
రానాతో సినిమా ఎప్పుడు...
రానాతో మొదటి సినిమా చేయాలనుకున్నా కుదరలేదు. రెండో సినిమాకు శేఖర్ కమ్ముల వచ్చి 'లీడర్' తీశాడు. పూరీతో తీశాం. తర్వాత కృష్ణ వందే వచ్చింది. చేసేశారు. ఇప్పుడు బాహుబలి, రుద్రమదేవి అయ్యాక.. తర్వాత చిత్రం మా బేనర్లోనే చేయాలని ఉంది. 'కవచం', 'చుట్టాలబ్బాయి' వంటి కథలతో పాటు పూరీ, శ్రీధర్ రాఘవన్ వంటివారు కూడా కథలు చెప్పారు. ఏది అవుతుందో చూడాలి. రెండోవాడు అభిరామ్ ప్రొడక్షన్ చూసుకుంటున్నాడు. వాడిని హీరోగా చేయాలని లేదు.
ఇండస్ట్రీలో ఆ నలుగురు అంటున్నారు...
ఆ నలుగురులో నేను ఉన్నానంటే బాధపడేవారిని చూస్తే జాలేస్తుంది. ఇది ఒక్కసారే వచ్చిపడింది కాదు. 50 ఏళ్ళుగా ఒక్కో మెట్టు ఎక్కితే ఈ స్థాయికి చేరాం. అదికూడా చట్టపరంగానే జరిగింది. మా స్కూల్‌మేట్.. గూగుల్‌లో షేర్స్ కొన్నాడు. నేను బాధపడితే ఎలా.. అతని తెలివి అతనిది. థియేటర్ దొరకడం లేదని బాధపడే కంటే థియేటర్లో లాభాలు వస్తున్నాయంటే.. పది థియేటర్లు కట్టమని ప్రభుత్వాన్ని అడగమనండి.
ముందుముందు థియేటర్ కల్చర్ మారిపోతుంది. కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. కార్నివాల్ అనే గ్రూప్ వచ్చేసింది. బాంబేలో 110 కోట్లతో థియేటర్లను చేజిక్కించుకుంటుంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని మల్టీప్లెక్స్‌లు రెట్టింపు రేటుతో కొనే స్థితి వచ్చింది.
ఐదేళ్ళలో మార్పు వస్తుందంటున్నారు...
ఇండస్ట్రీ అనేది ఐదేళ్ళలో మారిపోతుంది. హైదరాబాద్‌లోనే ఉండాలనేది లేదు. వైజాగ్, తడ, విజయవాడ ఎక్కడైనా ఉండేలా ఎదిగే దశకు మారుతుంది. ఒక్కచోటే ఉండి అక్కడే సినిమాలు తీసే స్థితి మారిపోతుంది. కరీంనగర్ నేపథ్యంలో కథ తీసుకుని అక్కడే సినిమా తీసే రోజులు కూడా వస్తున్నాయి. సినిమా పరిశ్రమ అనేది ఒక్కచోట అనేది శాశ్వతం కాదు. సినిమా తీయాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోవాలి. ఆ వాతావరణం, పరిమిత ఖర్చు ఎక్కడుంటే అక్కడే పరిశ్రమ ఉంటుంది. ఫారిన్లో షూటింగ్ చేస్తే రోడ్ల గురించి పోలీస్ పర్మిషన్ అవసరంలేదు. కానీ మన దగ్గర అపార్ట్మెంట్లో తీసినా పోలీస్ పర్మిషన్ కావాలి. ఇలా చాలా సమస్యలతో సినిమా పరిశ్రమ ఉంది... దీన్ని అధిగమించే దిశగా ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాను అని ముగించారు.

