నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..
నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించిన అమరావతిపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న అక్కసు ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. అందుకే ఏపీ రాజధానిపై ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ప్లాన్ బి పేరిట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్లాన్ ప్రకారం మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని సూచించారు.
ఇదే అంశంపై ఆయన బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని విషయంలో తమ ప్లాన్ ఏ ఫలించలేదని, అందుకే ప్లాన్ బి ఏంటో కూడా అందరికీ తెలుసున్నారు. ప్లాన్ బి ప్రకారం మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని ఏరియాగా ప్రకటించాలని కోరారు. ఆ ప్రాంతానికి మావిగన్ అనే పేరు పెట్టాలని కోరారు.
మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు దూరం ఉందని, మొత్తం 110 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవే ఉన్న ప్రాంతాన్ని మావిగన్ పేరుతో రాజధాని చేయాలని, మావిగన్ అంటే జగన్ గుర్తుకు వస్తాడనుకుంటే మరో పేరు పెట్టుకోవచ్చని సూచించారు.
వైకాపా అమరావతికే కాదు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కానే కాదన్నారు. కానీ, చంద్రబాబు 12 యేళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యామ్, నారా లోకేశ్ కుటుంబాలు మూడు ప్రత్యేక విమానాల్లో విజయవాడ టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నారని విమర్శించారు.
