1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Government allocates Rs178 Cr for Jal Jeevan Mission to Pendurthi Assembly Segment

పెందుర్తి నియోజకవర్గానికి జల జీవన్ మిషన్‌లో భారీ నిధులు

pawan - panchakarla
పెందుర్తి నియోజకవర్గానికి జల జీవన్ మిషన్‌లో భారీగా నిధులు మంజూరయ్యాయి. ఈ నియోజవర్గానికి జల్ జీవన్ మిషన్ కింద ఏకంగా రూ.178.57 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో అమరజీవి జలధార ద్వారా తాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
 
ప్రొద్దుటూరులో జరిగిన అమరజీవి జలధార శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి ఇంటికి నీటి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. 
 
రాయలసీమ పౌరుషం అంటే గొడ్డలి పోట్లు కాదు : పవన్ కళ్యాణ్ 
 
రాయలసీమ పౌరుషం అంటే గొడ్డలి పోట్లు కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కడప జిల్లా పొద్దుటూరులో జరిగిన అమరజీవి జలధార పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, గొడవలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఈ నేల రూపు రేఖలను అభివృద్ధి పథంలో మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కడప జిల్లా ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రూ.30,156 కోట్ల విలువైన 'అమరజీవి జలధార' పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద ఈ బృహత్తర తాగునీటి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో 24,601 ఆవాసాల్లో 50,315 పనులను ఈ పథకం కింద చేపట్టనున్నట్లు వివరించారు. 
 
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 'హర్ ఘర్ జల్ జలజీవన్ మిషన్'కు 2019-24 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచింది. రూ.26,000 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపి, ఐదేళ్లలో కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. ప్రజల తాగునీటి కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు" అని దుయ్యబట్టారు.
 
2024లో ఈ పథకం ముగిసిపోవాల్సిన తరుణంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు సి.ఆర్.పాటిల్, నిర్మలా సీతారామన్లను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. వారి సహకారంతో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని, పనులను వేగవంతం చేశామని తెలిపారు. 
 
'గత ప్రభుత్వం ఖర్చు చేయగా మిగిలిన పనులతో పాటు, ఇప్పటికే మేము రూ.4,500 కోట్ల విలువైన పనులను పూర్తి చేశాం. మీరు మాపై ఉంచిన నమ్మకమే మాకు శ్రీరామరక్ష' అని పవన్ పేర్కొన్నారు. తమది కక్షసాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజాభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుందని పవన్ స్పష్టం చేశారు. 
 
'దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పులివెందుల నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పథకాలకు రూ.280 కోట్లు కేటాయించి 7 మండలాల్లోని 299 గ్రామాలకు నీరందిస్తున్నాం. అలాగే, వైసీపీ ఎంపీ ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. మాకు పార్టీలు కాదు, ప్రజల సమస్యలే ముఖ్యం' అని ఉద్ఘాటించారు. 
 
'యుద్ధం వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు నా గొంతు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇది శాంతి సమయం. ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన సమయం. అందుకే రాయలసీమ పౌరుషానికి తగిన స్పీచ్ మాట్లాడట్లేదు. రాయలసీమ అభివృద్ధికి అవసరమైన విధంగా మాట్లాడుతున్నా. గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాం' అని అన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలంగాణలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు... అక్కడక్కడా వర్షం