పవన్ కల్యాణ్ ఓజీ సినిమా చూపిస్తూ.. మహిళకు ఆపరేషన్.. వైద్యులు సక్సెస్
Og Movie
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇటీవల మూర్ఛ రావడంతో కిందపడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మెదడులో సున్నితమైన ప్రాంతానికి దగ్గర్లో ట్యూమర్ వుందని పరీక్షల్లో నిర్ధారించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
సాధారణ పద్ధతిలో మత్తు ఇచ్చి సర్జరీ చేస్తే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. ఈ నేపథ్యంలో ఆమె స్పృహలో ఉండగానే శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు గాను ఆమెకు ఇష్టమైన నటుడు పవన్ కల్యాణ్ సినిమా ఓజీని చూపిస్తూ ఆపరేషన్ చేశారు. కోటేశ్వరమ్మ సినిమా చూస్తూ, వైద్యులతో మాట్లాడుతూ వారి సూచనలను పాటించారు. ఈ క్రమంలో డాక్టర్ల బృందం విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించారు.
