1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. white paper on ap financial situation

ఏపీ ఆర్థికస్థితి దుర్బరం.. రాష్ట్ర స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థికమంత్రి బుగ్గన

white paper
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థికలోటులో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలోని ప్రచార విభాగంలో రాష్ట్ర ఆర్థికస్థితిగతులపై మంత్రి బుగ్గన శ్వేతపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వాస్తవాలను చూపించే షీట్ గా శ్వేతపత్రాన్ని అభివర్ణించారు. విస్తీర్ణంలో దేశంలోనే ఏపీ 8వ రాష్ట్రమని కానీ స్థూల ఉత్పత్తి పెరుగుదల విషయంలో వెనుకబడి ఉందన్నారు. కానీ 2004-09లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12 శాతం పెరుగుదలతో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ముందున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. 2014-19 మధ్యకాలాన్ని బ్యాడ్ పీరియడ్ గా వర్ణించారు.

ప్రజలు అనుకున్నట్లుగా, కోరుకున్నట్లుగా విభజన జరగలేదని, వద్దనుకున్నా విభజన జరిగిందని అందువల్లే ఈ ఇబ్బందులు అని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం అనుబంధ రంగాలను వ్యవసాయంతో కలిపి చూపి ప్రజలను తప్పుదోవ పట్టించిందని  మంత్రి విమర్శించారు.  గత ఐదేళ్ల లో వ్యవసాయరంగం అభివృద్ధి చెందకపోగా మైనస్ లలోకి వెళ్లిపోయిందని తెలిపారు.

చేపలు, పశు సంవర్థక శాఖలో వృద్ధిని వ్యవసాయానికి జోడించడం వల్ల వ్యవసాయం రంగంలో ముందంజలో ఉందని గత ప్రభుత్వం సూచించడాన్ని మంత్రి తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ర్టం రూ.66 వేల కోట్ల ఆర్థిక లోటులో ఉందని వెల్లడించారు. విభజన నాటికి రూ.20 వేల కోట్ల ఆర్థిక లోటులోనే ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  రూ. 3.62 లక్షల కోట్ల అప్పులో ఉందని ప్రకటించారు.

ఏ శాఖలో చూసిన పెండింగ్ లు, అప్పులే ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రమైనా అప్పులు చేయవచ్చు కానీ గత ప్రభుత్వం ఆ అప్పులు విలువైన అవసరాలకు చేసి ఉంటే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఎఫ్ఆర్ బీఎంను దాటి అప్పులు చేసిందన్నారు. అప్పులు చేసినప్పటికీ దానిని తీర్చగలిగే, వనరులు సృష్టించే వాటిపై అప్పు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

విద్య, ఉద్యోగ అవకాశాల పెంపుదలతో పాటు ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టిసారిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుదలకై కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.  విద్యారంగంపై పెట్టిన అప్పును పెట్టుబడిగా భావించాలన్నారు. అదే విధంగా  తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం కంటే  వెనుకబడి ఉండటం బాధపడాల్సిన విషయం అన్నారు.

తెలంగాణ కు వచ్చినట్లు ఏపీకి పన్ను ఆదాయం రాకపోవడం కూడా ఒక రకంగా ఇన్ని సమస్యలకు కారణమని మంత్రి అన్నారు. రైతు విత్తనం వేయకముందే సాయం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని మంత్రి బుగ్గన అన్నారు. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో ఈ తరహా విధానం రావాలని సూచించారు.

రైతులకు ఇన్సూరెన్స్ కల్పించే గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. త్వరలోనే రైతులు కూడా ఈ తరహా విధానానికి అలవాటు పడతారన్నారు. అదే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు.

ప్రాధాన్యతా క్రమంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, వాళ్లు చెప్పిందల్లా, తాము ప్రత్యేక హోదా రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రహిత రాష్ట్రాలు అని చూడడంలేదని, తమ పరిధిలో కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మాత్రమే వెల్లడించారని బుగ్గన వివరించారు.

ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉంటే ,ఆ రాష్ట్రం ప్రత్యేక హోదా రాష్ట్రం కాకపోయినా సరే తాము నిధులు ఇస్తామని ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు. ఈ కారణంగానే ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్యాకేజి వచ్చిందని మంత్రి బుగ్గన వెల్లడించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
తిరుమల టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి నియామకం