గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 8 జులై 2020 (13:32 IST)

కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపించొచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

గాలిలో చిన్న కణాల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. కిక్కిరిసిన ప్రాంతాల్లో, లేదా తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే విషయాన్ని కొట్టిపారేయలేం అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక అధికారి చెప్పారు. కోవిడ్-19 మూసి ఉన్న ప్రదేశాల్లో కూడా వ్యాపించగలదని ఆధారాలు ధ్రువీకరిస్తున్నాయి.

 
కరోనావైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలను డబ్ల్యుహెచ్ఓ తక్కువ అంచనా వేస్తోందని ఆరోపిస్తూ 200 మందికి పైగా శాస్త్రవేత్తలు ఒక బహిరంగ లేఖ రాశారు. కరోనా ఉన్నవారు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఓ ఇప్పటికే చెప్పిది. “వారు ఆధారాలు గుర్తించాలని మేం కోరుతున్నాం” అని శాస్త్రవేత్తలు రాసిన లేఖలో సంతకం చేసిన కోలరాడో యూనివర్సిటీ కెమిస్ట్ జోస్ జిమెంజ్ రాయిటర్స్ ‌కు చెప్పారు.

 
”ఇది కచ్చితంగా డబ్ల్యుహెచ్ఓ మీద దాడి కాదు. ఇది ఒక శాస్త్రీయ చర్చ. కానీ ఆధారాలు ఉన్నాయని చాలాసార్లు చెప్పినా, వారు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో, మేం బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది” అని ఆయన చెప్పారు. ఈ ఆధారాలు ప్రాథమికం, దీనిని మరింత నిర్థరించడం అవసరం అని డబ్ల్యుహెచ్ఓ అధికారులు అంటున్నారు.

 
“జనం కిక్కిరిసిన, మూసి ఉన్న ప్రాంతాల్లో, తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనే విషయాన్ని తోసిపుచ్చలేం అనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి” అని డబ్ల్యుహెచ్ఓ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ టెక్నికల్ లీడ్ బెనెడెట్టా అల్లెగ్రాంజీ చెప్పారు.

 
మారుతున్న స్థితి
ఇమోజెన్ ఫౌక్స్, బీబీసీ న్యూస్, జెనీవా
కరోనా ఉన్నవారు దగ్గడం, తుమ్మడం వల్ల బయటికొచ్చిన కోవిడ్-19 బిందువుల ద్వారానే అది ఇతరులకు వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఓ కొన్ని నెలలుగా చెబుతూ వస్తోంది. కోవిడ్ బిందువులు గాలిలో తేలియాడుతూ ఎక్కువసేపు ఉండవని, అవి ఏదోఒక ఉపరితలంపై పడిపోతాయని చెప్పింది. అందుకే దాని వ్యాప్తిని నివారించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం కీలక నివారణ చర్యగా గుర్తించామంది.

 
కానీ 32 దేశాలకు చెందిన 239 శాస్త్రవేత్తలు దానిని అంగీకరించడం లేదు. వైరస్ గాలిలో కూడా వ్యాపిస్తుంది అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా రోగులు మాట్లాడిన లేదా శ్వాస వదిలిన తర్వాత ఆ సూక్ష్మ కణాలు కొన్ని గంటలపాటు అక్కడ తేలుతూనే ఉంటాయని చెప్పారు.

 
అదే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. మూసి ఉన్న ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రాంతాలు లాంటి నిర్దిష్ట పరిస్థితుల్లో అది గాలిలో వ్యాపించే అవకాశం ఉందని ఆధారాలు చెబుతున్నట్లు తెలిపింది. "ఆధారాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంది. దీనిని ధ్రువీకరిస్తే, వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవచ్చు అనే సలహాలను కూడా మార్చాల్సి ఉంటుంది. అది మాస్కులు మరింత విస్తృతంగా వాడడానికి, సామాజిక దూరం, ముఖ్యంగా బార్లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణాలో దూరం పాటించడాన్ని మరింత కఠినతరం చేయడానికి కారణం కావచ్చు" అని చెప్పింది.