1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iranian singer flogged 74 times for performing without hijab: What to know

హిజాబ్ ధరించకుండా పాట పాడిన గాయని.. 74 కొరఢా దెబ్బలు

Iranian singer Parastoo Ahmadi
ఇరాన్‌లో మరో దారుణం జరిగింది. ఆ దేశ పాలకులు మహిళల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. మత ఆచారాల పేరుతో మహిళను అణచివేతకు గురిచేస్తున్నారు. తాజాగా గాయని హిజాబ్ ధరించకుండా పాట పాడినందుకు శిక్షగా 74 కొరఢా దెబ్బలు కొట్టారు. యూట్యూబ్‌లో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఆమె హిజాబ్ ధరించకుండా కనిపించడమే నేరంగా భావించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇరాన్‌కు చెందిన ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీ  గత 2024 డిసెంబరులో కోమ్ నగరంలో సంగీత ప్రదర్శన ఇచ్చారు. నలుగురు గాయకులతో కలిసి హిజాబ్ లేకుండా పాటలు పాడారు. ఆ సమయంలో అక్కడ ప్రేక్షకులు కూడా ఎవరూ లేరు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా, ఆ పాట వైరల్ కావడంతో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 
 
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఇరాన్ న్యాయస్థానం... అహ్మదీ పాటు ఆమె బృందంలోని ఒక్కొక్కరికీ 74 కొరఢా దెబ్బల శిక్ష విధించింది. అంతేకాకుండా, రెండేళ్లపాటు విదేశీ ప్రయాణాలు, కళా, సంగీత కార్యకలాపాలపై నిషేధం విధించింది. తాజాగా నవంబరు 23వ తేదీన గాయని అహ్మదీతో పాటు నలుగురు బృందం సభ్యులకు 74 కొరఢా దెబ్బల శిక్ష  అమలు చేసినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 
 
కాగా, గత 2022లో అమినీ అనే యువతిని హిజాబ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నైతిక పోలీసులు అదుపులోకి తీసుకోగా, కస్టడీలో మరణించిన విషయం తెల్సిందే. ఈ ఘటన తర్వాత ఇరాన్‌లో మహిళల హక్కులపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విజయవాడ 13వ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం