1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Reliance Retail, Jio to launch new e-commerce platform

ముఖేష్ అంబానీ కొత్త బిజినెస్... ఆన్‌లైన్ షాపింగ్

Reliance Retail
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. రిలయన్స్ జియోతో టెలికాం సేవలు ప్రారంభించిన ముఖేష్... దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్నారు. ముఖ్యంగా, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రిలయన్స్ జియో పుణ్యమాని సామాన్య ప్రజానీకానికి కూడా ఉచితంగానే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు కుదేలైపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ త్వరలో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ముఖేష్ అంబానీ కూడా ఆన్‌లైన్ వ్యాపారంపై కన్నేశారు. రిలయన్స్ జియో సేవలను ఉపయోగించుకుని ఈ వ్యాపారంలో కూడా సక్సెస్ సాధించాలని ఆయన భావిస్తున్నారు. 
 
ఇప్పటికే ఆన్‌లైన్ మార్కెట్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వంటి వెబ్‌సైట్లు ఈ-కామర్స్ దిగ్గజాలుగా ఉన్నాయి. వీటికి పోటీగా ముఖేష్ అంబానీ తన సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ సరికొత్త ప్రాజెక్టు మరో ఏడాది సమయంలో పట్టాలు ఎక్కుతుందని రిలయన్స్ కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్స్‌లు సంయుక్తంగా ఈ ఈ-కామర్స్ మార్కెట్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో జరుగుతున్నాయి. 
తర్వాతి కథనం
తెలంగాణ శాసనసభ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క