తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్ : కాంగ్రెస్ - టీడీపీ ఖాళీ ఖాయమా?
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఖాళీ చేసే దిశగా తెరాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల తరపున గెలిచిన పలువురు మంత్రులు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస బంపర్ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెల్సిందే. ఫలితంగా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించింది. ముఖ్యంగా, ప్రజాకూటమిని తెరాస చిత్తుచిత్తుగా ఓడించి ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది. అలాగే, కాంగ్రెస్ పార్టీ 19, టీడీపీ 2, బీజేపీ 1 స్థానాల్లో గెలుపొందగా, ఎంఐఎం 7, ఇతరులు మరో రెండు స్థానాల్లో గెలుపొందారు.
ఈ నేపథ్యంలో తెరాస ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇందులోభాగంగా, సీఎం కేసీఆర్‌పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. ఆయన ఏక్షణమైనా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న ఒంటేరు ప్రతాప రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాకివ్వాలని గులాబీ నేతలు వ్యూహాం రచించారు. ఇది ఇపుడు సక్సెస్ అయింది. ఫలితంగా ఒంటేరు గులాబీ కండువా కప్పుకోనున్నారు.
అలాగే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాస గూటికి చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులోభాగంగానే ఆయన గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద తెరాస చీఫ్ కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీలను ఖాళీ చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు.