గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (15:10 IST)

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మాకెలాంటి అభ్యంతరం లేదు : కేటీఆర్

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వాలని, ఈ విషయంలో తమకెలాంటి అభ్యంతరం లేదని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై పలు వేదికలపై తమ పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు.. రాజ్యసభ సభ నేత కె.కేశవ రావు, లోక్‌సభ సభ్యురాలు కవితలతో పాటు తాను కూడా చెప్పానని తెలిపారు. అందువల్ల నాడు ప్రధాని ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. 
 
వైకాపా అధినేత వైఎస్ జగన్‌తో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య భేటీ గంటన్నరపాటు జరిగింది. ఈ సమావేశంలో తెరాస వైపు నుంచి ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైకాపా నుంచి వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి హాజరయ్యారు.
 
ఈ భేటీ తర్వాత కేటీఆర్, జగన్‌లు సమయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ముందుగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడచిన కొన్నేళ్లుగా దేశంలో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన వద్ద ఉంచుకుని రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేస్తోందన్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని తీసుకొచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదతర నేతలను కలిశారని చెప్పారు. ఆ పరంపరలో భాగంగానే ఏపీ ప్రతిపక్షనేత జగన్‌కు మంగళవారం ఫోన్ చేసి, కలుస్తామని చెప్పామని... వారి ఆహ్వానం మేరకు బుధవారం కలిశామని చెప్పారు.
 
జగన్ మోహన్ రెడ్డితో జరిగిన భేటీలో అన్ని విషయాలను పంచుకున్నామని కేటీఆర్ అన్నారు. అందరు నేతలను కలిసినట్టే... ఏపీకి వెళ్లి జగన్‌ను కేసీఆర్ కలుస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో చర్చలను మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలను సాధించుకునేందుకు ఎంపీల పరంగా సంఖ్యాబలం కావాలన్నారు. 
 
ఏపీకి చెందిన 25మంది, తెలంగాణాలోని 17 ఎంపీ సీట్లను కలుపుకుంటే సంఖ్యా పరంగా 42కు పెరుగుతుందన్నారు. ఆ విధంగా ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ ప్రయత్నాలను తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా చర్చలు మున్ముందు సాగుతాయని, ముఖ్యంగా, రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తరహా ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.