శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (09:31 IST)

తెరాస తొలి లోక్‌సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?

గత యేడాది (గత డిసెంబరు) జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఘన విజయం సాధించింది. నాలుగు ప్రధాన పార్టీలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి పోటీచేసినప్పటికీ.. తెరాస కారు వేగానికి కుదేలయ్యాయి. దీంతో మే నెలలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగా, ఆ పార్టీ తరపున పోటీ చేసే తొలి అభ్యర్థిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ సీనియర్ నేత వినోద్ పోటీ చేస్తారని వెల్లడించారు. వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు.
 
ఇకపోతే, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తామని పదేపదే చెబుతున్న కేసీఆర్ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో అత్యంత ప్రధాన భూమికను పోషించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులోభాగంగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లేదా మెదక్ స్థానం నుంచి పోటీ చేయవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో తెరాస లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిసారించింది. ఇందులోభాగంగా, మూడు నాలుగు నెలలకు ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది.