ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2026 (15:33 IST)

పని ఒత్తిడి భరించలేక... భాగ్యనగరిలో మహిళా టెక్కీ ఆత్మహత్య

mental problems
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పని ఒత్తిడిని తట్టుకోలేక కర్నాటకకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిని కొండాపూర్‌లోని సుమధుర అపార్టుమెంటులో నివాసం ఉంటున్న 32 యేళ్ల మనుశ్రీగా గుర్తించారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. 
 
కాగా, పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన మనుశ్రీ సోమవారం రాత్రి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది. పక్క గదిలో ఉండే మరో యువతికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పక్క గదిలోని యువతి వచ్చి గది తలుపులు తీయడంతో మనుశ్రీ సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. దీనిపై అపార్టుమెంట్ సెక్యూరిటీ గచ్చిబౌలి పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు.