రేణుకా స్వామి హత్య కేసు : అప్రూవర్‌గా ఏ14 - దర్శన్‌కు చిక్కులు తప్పవా?
కన్నడ నటుడు దర్శన్‌కు చిక్కులు తప్పేలా లేవు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులోని నిందితుల్లో 14వ నిందితుడుగా ఉన్న ప్రదోష్ అప్రూవర్‌గా మారి, వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించాడు. అయితే, వాంగ్మూలం నమోదుపై ట్రయల్ కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో దర్శన్‌కు తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ ఆ తర్వాత మాత్రం మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్టు న్యాయనిపుణులు అంటున్నారు.
ఈ కేసు విచారణ సందర్భంగా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని, అప్పటివరకు ప్రదోష్ వాంగ్మూలం నమోదుపై స్టే విధించాలని దర్శన్ తరపు సీనియర్ న్యాయవాది హష్మత్ పాషా కోర్టును అభ్యర్థించారు. అయితే, ప్రదోష్ తరపు న్యాయవాది దివాకర్ దీనిని వ్యతిరేకించారు. ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు ప్రాసిక్యూషన్ సైతం అంగీకరించిందని, అందువల్ల తక్షణమే వాంగ్మూలం నమోదు చేయాలని ఆయన కోరారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు... ఈ నెల 18వ తేదీ వరకు వాంగ్మూలం నమోదును నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది.
అదేసమయంలో జైలులో ప్రదోష్ ప్రాణాలకు ముప్పు ఉందని అతని న్యాయవాది దివాకర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి ప్రత్యేక సెల్ కేటాయించి, పటిష్ట భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ప్రదోష్‌కు తగిన రక్షణ కల్పించాలని పరప్పణ అగ్రహార జైలు అధికారులను ఆదేశించింది. అలాగే, అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా విచారణకు హాజరుపరచాలని సూచించింది. కాగా, ఈ విచారణకు దర్శన్, పవిత్రా గౌడ, ప్రదోష్ ముగ్గురూ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
