1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Amitabh Bachchan donates Rs 21 lakh to Shimla NGO for humanitarian work

బాలీవుడ్ బిగ్ బి గొప్ప మనసు - సామాజిక కార్యకర్తకు రూ.21 లక్షల విరాళం

amitabh donation
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. 'కౌన్ బనేగా కరోడ్పతి' (కేబీసీ) వేదికపై సిమ్లాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త నిస్వార్థ సేవ గురించి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే తన వ్యక్తిగత ఖాతా నుంచి ఏకంగా రూ.21 లక్షల విరాళాన్ని ఆ సంస్థకు అందించారు.
 
సిమ్లాకు చెందిన సామాజిక కార్యకర్త సర్ జీత్ సింగ్ బాబీ 'ఆల్మైటీ బ్లెస్సింగ్స్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఇటీవల ఆయన కేబీసీ కార్యక్రమంలో 'ఫోర్స్ ఆఫ్ గుడ్' గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న సేవల గురించి తెలుసుకున్న అమితాబ్, కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రశంసల లేఖతో పాటు ఈ భారీ మొత్తాన్ని విరాళంగా పంపారు. ఇది షో తరపున కాదని, పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు.
 
సరీత్ సింగ్ బృందం గత 12 ఏళ్లుగా సిమ్లాలోని ఆసుపత్రుల వద్ద రోగుల సహాయకులకు, పేదలకు ఉచితంగా భోజనం అందిస్తోంది. రోగులతో పాటు వచ్చే వారి కుటుంబ సభ్యులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 4,000 మంది ఆకలి తీరుతోంది.
 
అంతేకాకుండా, గత 28 ఏళ్లుగా ఎవరూ క్లెయిమ్ చేయని అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. రక్తదాన శిబిరాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలను కూడా ఈ సంస్థ చేపడుతోంది.
 
అమితాబ్ బచ్చన్ అందించిన ఆర్థిక సాయంపై సర్ట్ జీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విరాళం తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఎంతగానో తోడ్పడుతుందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తన ఒక్కడిది కాదని, తనతో పాటు పనిచేస్తున్న వాలంటీర్లు, దాతల సమష్టి కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దేవుడికి స్మార్ట్ ఫోన్ కొనిపెడితే.. ఏం జరుగుతుంది..?