సూర్య నిర్మాతకు ఆర్థిక కష్టాలు.. విడుదలకు నోచుకోని 'కరుప్పు'
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభులు నిర్మించార. ఈ నెల 14వ తేదీ గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. దీంతో సినిమాను విడుదల చేయలేకపోయారు.
ఇదే విషయంపై నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్ ప్రభు భావోద్వేగపూర్తిగా ఓ ట్వీట్ చేశారు. 'ఈ సినిమాపై ఇదే చివరి అప్‌డేట్ అవ్వాలని భావిస్తున్నాను. అభిమానులందరినీ క్షమాపణలు కోరుతున్నా. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. సినిమా చూడటం కోసం మీరు ఎంతో దూరం నుంచి ఉదయం 9 గంటల షో కోసం థియేటర్‌కు వచ్చి ఉంటారు. తమిళనాడు, కేరళతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లు దీని కోసం చాలా ఎదురుచూశారు. మీకు జరిగిన అసౌకర్యానికి నేను ఎంతో బాధపడుతున్నా. మనం సాధారణంగా ఇంట్లో ఉండే సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సినిమా చూడాలనుకుంటాం. కానీ, చివరి నిమిషంలో షో క్యాన్సిల్ అయితే మీరెంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు'
'ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు అయినా ఈ సమస్యలన్నీ పరిష్కారమై సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నా. మే 14న సినిమా విడుదలవుతుందని.. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితులు చూసి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఏదేమైనా భగవంతుడి దయతో సాయంత్రం కల్లా అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. చాలా మంది దీని కోసం ఎంతో కృషి చేస్తున్నారు. సూర్య కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. మీ అందరి అంచనాలను ఈ సినిమా ఖచ్చితంగా అందుకుంటుంది' అని అన్నారు.
