ప్రధాని మోడీ స్కూల్‌మేట్ భూవివాదం పరిష్కారం...
ఏళ్ల నాటి భూవివాదంలో ప్రధాని నరేంద్ర మోడీ స్కూల్‌మేట్ అస్గర్ అలీ వోహ్రాకు ఊరట లభించింది. ఈ వివాదం నుంచి వెనక్కి తగ్గిన స్థానిక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే.. ప్రధాని స్నేహితుడికి భూమిని అప్పగించారు. ఈ ఆస్తి వ్యవహారం గురించి అస్గర్ అలీ ఇటీవల మోడీని కలిసిన కొన్ని రోజులకే తాజా పరిణామం చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నివసిస్తోన్న 81 ఏళ్ల అస్గర్‌అలీ వోహ్రా.. గుజరాత్‌లోని భయందర్ ఈస్ట్‌లో గల నవ్‌ఘర్ రోడ్డులో ఉన్న సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో కొనుగోలు చేశారు. ఈ భూమిని 2011లో స్వయం బిల్డర్స్, సెవెన్ ఎలెవన్ కన్‌స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలు ఆక్రమించుకున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ రెండు సంస్థలతో బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు సంబంధం ఉందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
2015లో పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా.. దాదాపు 11ఏళ్ల తర్వాత ఇటీవల కోర్టుకు నివేదిక సమర్పించారు. మరోవైపు, ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది ఆ రెండు సంస్థలు.. వోహ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన అస్గర్‌అలీ వోహ్రా.. సెప్టెంబరు 8న ప్రధాని మోదీని కలిసి తన ఆవేదనను విన్నవించుకున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని అభ్యర్థించారు.
కాగా, సెప్టెంబరు 16న ఈ కేసుపై మున్సిపల్ కార్పొరేషన్‌లో విచారణ జరగాల్సి ఉంది. ఆ లోగానే కేసు పరిష్కారమైనట్లు తెలిసింది. వోహ్రాతో భూవివాదం నుంచి ఆ రెండు సంస్థలు వెనక్కి తగ్గాయి. ఆయనకు భూమిని తిరిగిచ్చేందుకు అంగీకరించడంతో పాటు కేసును ఉపసంహరించుకున్నాయి. గుజరాత్‌లోని వాడ్‌నగర్‌లో గల బీఎన్ స్కూల్‌లో వోహ్రా చదువుకున్నారు. ఇదే పాఠశాలలో మోదీ కూడా విద్యనభ్యసించారు.

