1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. 5 Common LDL Cholesterol Myths Busted: Why Feeling Fine Doesn-t Mean Your Heart Is Safe

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

high cholesterol
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, సాధారణంగా “చెడు కొలెస్ట్రాల్” అని పిలిచే లో-డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C) గురించి ఉన్న అపోహల కారణంగా, లక్షలాది మంది సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటున్నారు.
 
డాక్టర్ రాజీవ్ మీనన్, కార్డియాలజీ క్లినికల్ డైరెక్టర్ & హెచ్‌ఓడీ, AIG హాస్పిటల్స్‌, హైదరాబాద్‌ ఇలా అన్నారు: “అధిక కొలెస్ట్రాల్‌ను తరచుగా ‘నిశ్శబ్ద ప్రమాదం’గా పిలుస్తారు. ఎందుకంటే ఇది స్పష్టమైన నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగించకపోవచ్చు. అయితే, ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం అంటే ప్రమాదం లేదని కాదు. LDL-C స్థాయికి ఉండాల్సిన లక్ష్యం ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. ఇది వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, ఇతర ఆరోగ్య సమస్యలు, మొత్తం గుండె ఆరోగ్య ప్రమాదం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సకాలంలో వైద్యుల సలహా తీసుకోవడం, వారు సూచించిన చికిత్సను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి ముఖ్యమైన చర్యలు.”
 
కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (CSI) 18 ఏళ్ల వయస్సు నుంచే క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన ఐదు సాధారణ అపోహలను తొలగిస్తూ, మీ గుండె ఆరోగ్యాన్ని భవిష్యత్తులోనూ కాపాడుకోవడానికి ఉపయోగపడే వాస్తవాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం.
 
అపోహ 1: “నేను యువకుడిని, ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉన్నాను కాబట్టి, నా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండవు.”
వాస్తవం: యువకుడిగా, శారీరకంగా ఫిట్‌గా ఉండటం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య రాదని చెప్పలేం. అధిక LDL-C స్థాయిలకు చాలాసార్లు జన్యుపరమైన లేదా జీవక్రియకు సంబంధించిన కారణాలు ఉంటాయి. వీటిని కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదా వ్యాయామం చేయడం ద్వారా మాత్రమే పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే యువతలో కూడా LDL స్థాయిలు అధికంగా ఉండవచ్చు. ఇవి కాలక్రమేణా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీయవచ్చు.
 
అపోహ 2: “నా రిపోర్ట్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ ల్యాబ్ పరిమితుల్లోనే ఉంటే, నా గుండె పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లే.”
వాస్తవం: ప్రామాణిక ల్యాబ్‌లో చూపించే సూచిక పరిధి సాధారణ జనాభాలో కనిపించే స్థాయిలను సూచిస్తుంది. అది ప్రతి వ్యక్తికి సరైన కొలెస్ట్రాల్ లక్ష్యం అని కాదు. గుండె జబ్బుల ప్రమాదం ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. మీ మొత్తం ఆరోగ్యం, ఇతర ప్రమాద కారకాలను పరిగణనలోకి తీసుకుని, హృద్రోగ నిపుణులు మీకు సరైన LDL-C లక్ష్యాన్ని నిర్ణయిస్తారు.
 
అపోహ 3: “అధిక కొలెస్ట్రాల్ వల్ల ఛాతీ నొప్పి, అలసట వంటి స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి.”
వాస్తవం: అధిక LDL-C అనేది ఎలాంటి శారీరక లక్షణాలు కనిపించకుండా ఉండే “నిశ్శబ్ద” ప్రమాద కారకం. ఇది ఎలాంటి అసౌకర్యం కలిగించకుండానే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ధమనుల్లో గణనీయమైన అడ్డంకి ఏర్పడే వరకు లేదా అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్య తలెత్తే వరకు దీని ప్రభావం బయటపడకపోవచ్చు. మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించడం వల్ల మీ LDL-C సరైన స్థాయిలో ఉందని నిర్ధారించలేం.
 
అపోహ 4: “ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రారంభిస్తే, నాకు కొలెస్ట్రాల్ మందులు అవసరం ఉండవు.”
వాస్తవం: గుండె ఆరోగ్యానికి సమతుల్యమైన ఆహారం, ఒత్తిడి నియంత్రణ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే, మీకు నిర్దేశించిన LDL-C లక్ష్యాన్ని చేరుకోవడానికి జీవనశైలిలో మార్పులు మాత్రమే కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చికిత్స తరచుగా దీర్ఘకాలికంగా కొనసాగాల్సి ఉంటుంది. సాధారణ చికిత్సలతో ఆశించిన ఫలితాలు రాని అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు, PCSK9 ఇన్హిబిటర్లు లేదా siRNA ఆధారిత చికిత్సలు వంటి ప్రత్యేక ఇంజెక్షన్ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
అపోహ 5: “నాకు స్టెంట్ లేదా బైపాస్ చేయించుకున్నాను కాబట్టి నా గుండె సమస్య పూర్తిగా నయమైపోయింది.”
 వాస్తవం: స్టెంట్ మూసుకుపోయిన నిర్దిష్ట రక్తనాళాన్ని తెరవడంలో సహాయపడుతుంది. బైపాస్ సర్జరీ రక్తప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే, ఈ రెండు విధానాలు రక్తంలో కొలెస్ట్రాల్ ప్రసరించడాన్ని ఆపలేవు. LDL-C నియంత్రణలో లేకపోతే, ఇతర రక్తనాళాల్లో కూడా ప్లేక్‌ పేరుకుపోవడం కొనసాగవచ్చు. అందువల్ల, ప్రక్రియ తర్వాత కూడా రోగులు తమ LDL-C స్థాయిని (55 mg/dL కంటే తక్కువగా) ఉంచే లక్ష్యంతో, వైద్యుల సూచన మేరకు నిరంతరం కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం అవసరం. ఇది భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
 
ఈ ప్రపంచ హృదయ దినోత్సవం (World Heart Day) సందర్భంగా, మీ ఆరోగ్య సూచికలపై అవగాహన పెంచుకోండి, మీ వ్యక్తిగత LDL-C లక్ష్యాన్ని తెలుసుకోండి, దీర్ఘకాలం పాటు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు