1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Father Dies While Dancing In Daughter's Wedding. Family Keeps News A Secret And Lets Wedding Proceed

కుమార్తె పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో తండ్రి మృతి... అంత్యక్రియలకు ముందే వివాహ...

Wedding
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్‌ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకవైపు కూతురి పెళ్లి సంబరాలు.. మరోవైపు కుటుంబ పెద్ద మరణం. ఆనందం, విషాదం ఒకేసారి ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కూతురి పెళ్లికి ముందు జరిగే వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఈ తీవ్ర విషాద సమయంలోనూ, ఆ కుటుంబం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తండ్రి అంత్యక్రియలకు ముందే కూతురి పెళ్లి పూర్తి చేయాలని నిశ్చయించుకుని, కన్నీళ్లు దిగమింగుకుని వివాహం జరిపించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉదయపూర్‌ జిల్లా రిషభేవ్ సబ్ డివిజన్‌లోని పటియార్ గ్రామానికి చెందిన శంకర్లాల్ మేఘ్వాల్ (51), అహ్మదాబాద్ నగరులో ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తున్నారు. ఆయన కూతురు ప్రియాంక (26) వివాహం నవంబరు 21వ తేదీన జరగాల్సి ఉంది. దీనికి ముందు నవంబర్ 20 రాత్రి, 'బిందోలి' అనే సంప్రదాయ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులతో కలిసి శంకర్ లాల్ ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
 
కుటుంబ సభ్యులు, కుమారులు దిలీప్, ఉమేష్ వెంటనే ఆయనను రిషభేవ్‌లోని ఆసుపత్రికి, ఆ తర్వాత ఉదయపూర్‌లోని ఎంబీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. మరుసటి రోజే చెల్లి పెళ్లి జరగాల్సి ఉండటంతో కుమారులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తండ్రి మరణ వార్త తెలిస్తే తల్లి, చెల్లి తట్టుకోలేరని, పెళ్లి వేడుక ఆగిపోతుందని భావించారు. తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, మాట్లాడే స్థితిలో లేరని ఇంట్లోవారిని నమ్మించారు.
 
వెంటనే వరుడి కుటుంబానికి సమాచారం అందించి, పెళ్లి త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అదే రాత్రి పెళ్లి వేదికకు చేరుకున్నారు. నవంబరు 21 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రియాంక వివాహ తంతును పూర్తి చేశారు. కూతురి అప్పగింతలు ముగిసిన తర్వాత, అదే రోజు శంకర్లాల్ అంత్యక్రియలను నిర్వహించారు.
 
అత్తారింటికి వెళ్లిన ప్రియాంకకు, ఆమె సోదరుడు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. తన తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భర్త మరణవార్త తెలియడంతో తల్లి కూడా అనారోగ్యం పాలయ్యారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర బెంగుళూరు : బీజేపీ ఎమ్మెల్యే జార్కిహోళి