దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక
దేశంలోని మౌలిక సదుపాయాలపై అమెరికా చేస్తున్న దాడుల కారణంగా దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని తమ దేశ ప్రజలకు ఇరాన్ ఓ హెచ్చరిక చేసింది. గత కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ తొలిసారి అంగీకరించింది.
మరోవైపు, దేశంలోని దక్షిణ ప్రావిన్సులలో తీవ్రమైన వేడిగాలులు వీస్తుండటంతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇరాన్ విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాడుల తీవ్రత అధికంగా ఉన్న దక్షిణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం సూచించింది. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరడం, మరోవైపు విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో ప్రజలు సాధ్యమైనంత వరకు విద్యుత్ ఆదా చేయాలని కోరింది.
హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ మధ్య వివాదం ముదురుతున్న తరుణంలో, ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులను కొనసాగిస్తోంది. గతంలో ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇరాన్‌లోని పలు లక్ష్యాలను ఛేదించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ దాడుల్లో విద్యుత్ ప్లాంట్లు, ట్రాన్స్ మిషన్ లైన్లు లేదా ఇతర వ్యవస్థలు ఎంతవరకు దెబ్బతిన్నాయనే వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న దాడుల వల్ల విద్యుత్ నెట్‌వర్క్‌లోని దాదాపు 2,000కు పైగా ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని, వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. పాతబడిన వ్యవస్థలు, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఆధునికీకరణకు నోచుకోకపోవడం, వేసవిలో పెరుగుతున్న డిమాండ్ వంటి కారణాలతో ఇరాన్ విద్యుత్ గ్రిడ్ ఇప్పటికే సంక్షోభంలో ఉంది. తాజా దాడులు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి.
