ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ
భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటైన రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్. పూర్తి స్థాయిలో టికెట్ ధర చెల్లించినా.. చాలీచాలని సీటులో కూర్చుని ప్రయాణం చేయాల్సిందే. ఒకసారి ప్లాన్ చేసుకున్నాక వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది అలానే ప్రయాణిస్తుంటారు. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. దీన్ని రద్దు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
సాధారణంగా రైళ్లలో బెర్తులు తగినన్ని అందుబాటులో లేనప్పుడు ఆర్ఏసీ కోటాలో సీట్లు కేటాయిస్తుంటారు. పూర్తిస్థాయిలో టికెట్ కన్ఫార్మ్ కానప్పటికీ.. రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. ఒక సైడ్ బెర్త్‌ను ఇద్దరికి కేటాయిస్తుంటారు. పొరపాటున స్త్రీ, పురుషులకు ఒకే బెర్త్ కేటాయింపు జరిగినప్పుడు.. సర్దుబాటు చేయడానికి టీటీఈలు కూడా నానా తంటాలు పడుతుంటారు.
ఇదే అంశాన్ని పార్లమెంటరీ ప్యానెల్ లేవనెత్తింది. అరకొర ప్రయాణం చేసినా పూర్తి టికెట్ ధరను వసూలు చేయడంలో హేతుబద్ధతను ప్రశ్నించింది. ఈ రిజర్వేషన్ పద్ధతిని సమీక్షించాలని రైల్వే శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్ఏసీ విధానాన్ని రద్దు చేసే అంశాన్ని భారతీయ రైల్వే పరిశీలిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
రైల్వే రిజర్వేషన్ టికెట్లు ఒకప్పుడు మాన్యువల్‌గా జరిగేవి. దీంతో ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే ఆ బెర్తు ఖాళీగా ఉండేది. దీంతో ఆర్ఏసీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకవేళ ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే ఆ బెర్తు కేటాయించేవారు. అప్పట్లో ఈ టికెట్ క్యాన్సిలేషన్లను ట్రాక్ చేయడానికి ఎలక్ట్రానిక్ వ్యవస్థ లేని రోజుల్లో వచ్చిన ఆర్ఏసీ.. ఏళ్లుగా అలానే ఉండిపోయింది.

