రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స - కేంద్రం కీలక ఆదేశాలు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు, రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసరంగా నగదు రహిత అత్యవసర చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పీఎం-రాహత్. ఈ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జాతీయ వైద్య విద్యా మండలి కీలక ఆదేశాలు జారీచేసింది.
'పీఎం రాహత్' పథకంలో భాగస్వాములు కావాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్ఎంసీ అధికారికంగా పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఆసుపత్రుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మెడికల్ కాలేజీల డైరెక్టర్లు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కోరింది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖల సూచనల మేరకు ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2026 ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా ప్రారంభమైన పీఎం-రాహత్ పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది.
ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజుల పాటు ఈ క్యాష్ లెస్ సదుపాయం వర్తిస్తుంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో వైద్యం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటలు, తీవ్ర గాయాలైన బాధితులకు 48 గంటల వరకు స్టెబిలైజేషన్ చికిత్సను అనుమతిస్తారు.
బాధితులు లేదా ఘటనా స్థలంలో సాయం చేసే వ్యక్తులు '112' ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి నిర్దేశిత ఆసుపత్రుల వివరాలు, అంబులెన్స్ సాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరే ఆసుపత్రుల్లో 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, ఎక్స్-రే, సీటీ స్కాన్ లాంటి వసతులతో పాటు ట్రామా, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ వైద్యులు తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

