1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Father poisons two sons, then dies by suicide in Bapatla, Andhra Pradesh

మద్యానికి బానిసై ఇద్దరు కుమారులకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

suicide
మద్యానికి బానిసైన ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషం సేవించిన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఇందిరానగర్ కాలనీలో జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
ఇందిరా నగర్ కాలనీకి చెందిన కట్టా రామకృష్ణ (36) స్థానిక గ్రామ పంచాయతీలో చెత్తను తరలించే వాహనం నడిపేవారు. అతని భార్య ఇళ్లలో పని చేసేవారు. వారికి ఇద్దరు కుమారులు. కొంత కాలంగా రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు మూగ, చెవుడు సమస్య ఉన్న పెద్ద కుమారుడికి రూ.5 లక్షల ఖరీదు చేసే వినికిడి పరికరం అవసరం. ఈ సమస్యల నుంచి గట్టెక్కే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మనోవేదనకు గురైన రామకృష్ణ నెల రోజుల నుంచి మద్యానికి బానిసయ్యారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన భార్య పనికి వెళ్లిన అనంతరం శీతలపానీయంలో ఎలుకల మందు కలిపి.. తాను తాగి ఇద్దరు కుమారులకు ఇచ్చారు. కుమారులు దానిని తాగేశారు. భార్య ఇంటికి వచ్చి చూసే సరికి ఇద్దరు పిల్లలతో పాటు భర్త వాంతులు చేసుకుంటూ కనిపించారు. ఆమె భర్తను నిలదీయడంతో అసలు విషయం చెప్పారు. కుమారులకు చికిత్స చేయించాలని కోరారు. తాను వైద్యశాలకు వెళ్లేందుకు తిరస్కరించారు. ఇంట్లో వారంతా పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత తన నివాసంలో ఉరి వేసుకుని రామకృష్ణ మృతి చెందారు. 
 
కుమారులను స్థానిక ప్రైవేటు వైద్యశాలకు, అక్కడి నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు, తదుపరి గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్దకుమారుడు వినయ్‌ కుమార్‌(13) ఈ నెల 9న ప్రాణాలు విడిచాడు. చిన్న కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్‌ బాబు తెలిపారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చంద్రుడిపైనే నివాసం.. వ్యోమగాముల కోసం నాసా అన్వేషణ.. 2028 నాటికి శాశ్వత స్థావరం