1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Transport sector accounts for 40% of air pollution, says Gadkari; calls for shift to clean fuels

దేశంల 40 శాతం వాయు కాలుష్యానికి తానే కారణం : నితిన్ గడ్కరీ

nitin gadkari
దేశంలో నానాటికీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీనిపై పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 40 శాతం వాయుకాలుష్యానికి తానే కారణమని, దీనికి తానే పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తున్నట్టు చెప్పారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
 
మంగళవారం ఢిల్లీలో జరిగిన 14వ సీఐఐ బయోఎనర్జీ సదస్సులో గడ్కరీ ప్రసంగించారు. "దేశవ్యాప్తంగా అత్యాధునిక రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఫలితంగా వాహనాల సంఖ్య పెరిగి, వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. రవాణా శాఖ మంత్రిగా దేశంలో నెలకొన్న 40 శాతం వాయు కాలుష్యానికి నేనే బాధ్యత వహిస్తున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తన పదవీ కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు చేరిందని, జపాన్‌ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
 
భారత్ తన ఇంధన అవసరాల కోసం 87 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతోందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉందని గడ్కరీ తెలిపారు. దిగుమతులను తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఇథనాల్, బయోగ్యాస్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెట్టుబడులు పెంచడం అనివార్యమన్నారు. 
 
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం 1.50 లక్షల ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే.. ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,000 మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్య నివారణకు జీవ ఇంధనాలపై నిరంతరం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా వాటిని బయోఎనర్జీగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. గోబర్ ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 3,000 బయోఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దిగుమతుల తగ్గింపు, వ్యయ నియంత్రణ, కాలుష్య రహిత ఇంధనం, స్వదేశీ ఉత్పత్తి అనే నాలుగు సూత్రాల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన విధానాన్ని రూపొందించిందని గడ్కరీ స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అక్వాన్... కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్