కిషన్ రెడ్డికి తీపి కబురు.. కీలక బాధ్యతలు అప్పగించిన మోదీ
ఓటమి విజయానికి తొలి మెట్టు అంటారు. కిషన్‌రెడ్డి విషయంలో అది నూటికి నూరు శాతం నిజమైంది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీతో పాటు బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో మొత్తం 57 మందికి మంత్రి పదవులు దక్కాయి. మోదీ మంత్రి వర్గంలో 21 మంది కొత్తవారు కాగా, 36 మంది గతంలో మంత్రులుగా పని చేసినవారే, మరో 9 మందిని స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేసారు.
తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డిని హోం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే కీలకమైన కేంద్ర హోం శాఖను మోదీ సన్నిహితుడైన అమిత్ షాకు కట్టబెట్టడం విశేషం. మోదీ కిషన్ రెడ్డిని తన కేబినెట్‌లోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై చివరి క్షణం వరకూ ఢిల్లీలో సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి తీపి కబురు వినిపించారు.