సంబంధిత వార్తలు
- ISRO: విద్యార్థుల కోసం ఇస్రోలో వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు.. దరఖాస్తులకు ఆహ్వానం
- తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి
- ఇస్రోకు ఎదురుదెబ్బ.. పీఎస్ఎల్వీ C62/EOS-N1 ప్రయోగం విఫలం
- ISRO PSLV-C62: పీఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ప్రయోగం.. ఎప్పుడంటే?
- ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులకు భలే డిమాండ్ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
చందమామపై దిగే ల్యాండర్ల కాలాన్ని పెంచుతాం : ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక అడుగు వేయనుంది. జాబిల్లిపై దిగే ల్యాండర్ల పనితీరు కాలాన్ని ప్రస్తుతం 14 రోజుల నుంచి 100 లేదా 200 రోజులకు పెంచేలా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. శనివారం బెంగుళూరులో జరిగన ఓ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
చంద్రుడిపై రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతాయి. ఆ సమయంలో సౌరశక్తి లభ్యత ఉండదు కాబట్టి, ల్యాండర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినకుండా రక్షించడమే ఈ నూతన సాంకేతికత ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం అణుశక్తి విభాగం భాగస్వామ్యంతో ప్రత్యేకమైన కృత్రిమ హీటర్లను రూపొందిస్తున్నట్లు వివరించారు.
2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ కేవలం ఒక లూనార్ డే (భూమిపై 14 రోజులు) మాత్రమే కార్యకలాపాలు సాగించాయి. చంద్రుడిపై రాత్రి ప్రారంభంకావడంతో, అక్కడి అత్యంత శీతల పరిస్థితులను తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో వాటిని 'స్లీప్ మోడ్'లోకి పంపాల్సి వచ్చింది.
'ప్రస్తుతం మేము కృత్రిమ హీటర్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలనిస్తే, భవిష్యత్తులో ల్యాండర్లు కేవలం 14 రోజులే కాకుండా, 100 నుంచి 200 రోజుల వరకు నిరంతరాయంగా పనిచేసే అవకాశం ఉంటుంది' అని నారాయణన్ పేర్కొన్నారు.
ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే చంద్రుడిపై దీర్ఘకాలిక పరిశోధనలకు, మరింత లోతైన శాస్త్రీయ సమాచార సేకరణకు వీలు పడుతుంది. ఇది భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే మానవసహిత, రోబోటిక్ మిషన్లకు ఎంతో ఊతమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. a
