శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 నవంబరు 2025 (21:07 IST)

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

cell phone
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతోంది. యూపీఐ, కార్డ్ పేమెంట్ల నుండి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ ఔట్‌లెట్ల విస్తృత వినియోగం వరకు వినియోగదారులు చేసే లావాదేవీలు కూడా భారీ మార్పు దిశగా పయనిస్తున్నాయి. ఆభరణాలు కొనడం కావచ్చు, జీవనశైలి అవసరాలను అప్‌గ్రేడ్ చేయడం కావచ్చు, ట్రావెల్ బుకింగ్స్ చేయడం కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరిశీలించడం కావచ్చు… వినియోగదారులు ఎప్పటికప్పుడు రిటైల్, ఈ-కామర్స్ రెండింటిలోనూ ఉత్తమ ఆఫర్ల కోసం వెతుకుతూనే ఉన్నారు.
 
వినియోగదారులు ముందుగా డిజిటల్ మార్గాలనే ఉపయోగించాలని కోరుకుంటున్న నేపథ్యంలో, తక్షణ లావాదేవీల సౌకర్యం కూడా ఖర్చు అలవాట్లను ప్రభావితం చేస్తోంది. ఈ-కామర్స్ మాత్రం విలువ పరంగా ఆధిపత్యాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ 2025లో మొత్తం క్రెడిట్ కార్డు వ్యయాలలో 66.4% వాటా ఈ-కామర్స్‌దే. UPI, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లు వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతుల వినియోగం పెరుగుతున్న తరుణంలో, వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండటం, అందుబాటులో ఉన్న ఆఫర్లు, డీల్స్‌ను తెలివిగా వినియోగించుకోవడం, అలాగే సురక్షితంగా, నిరంతరాయంగా చెల్లింపులు చేయడం ఎంతో కీలకం.
 
అంతర్జాతీయ మోసాల అవగాహనా వారోత్సవం సందర్భంగా, భారతదేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డ్ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్, వినియోగదారులు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలని, అలాగే ధైర్యంగా, భద్రంగా షాపింగ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచిస్తుంది.
 
నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లలోనే షాపింగ్ చేయండి: ఎప్పుడూ అధికారిక బ్రాండ్ వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయమైన మార్కెట్‌ప్లేస్‌లలో మాత్రమే కొనుగోలు చేయండి. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చే నకిలీ వెబ్‌సైట్ల ర్యాండమ్ లింకులు లేదా అటాచ్మెంట్‌లపై క్లిక్ చేయకండి, ఎందుకంటే అవి డిజిటల్ మోసాలకు ప్రధాన ద్వారాలుగా ఉపయోగించబడతాయి.
 
స్క్రీన్ షేరింగ్ మోసాలను నివారించండి: ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు వంటి మీ పరికరాల స్క్రీన్‌ను ఏ తెలియని వ్యక్తితోనూ పంచుకోవద్దు. మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారానికి యాక్సెస్ కలిగించవచ్చని భావించే థర్డ్-పార్టీ యాప్‌లు లేదా APK ఫైళ్లను మీ పరికరంలో డౌన్‌లోడ్ చేయకండి. ఎందుకంటే, వీటి వల్ల మోసాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
ఆఫర్లు/డీల్స్‌ను నిర్ధారించండి: అవాస్తవంగా కనిపించే భారీ డిస్కౌంట్లు, రీఫండ్ నోటిఫికేషన్‌లు, ముఖ్యంగా అధిక విలువ గల వస్తువులపై వచ్చే నకిలీ డీల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపు చేసే ముందు ఆఫర్‌ను బ్రాండ్‌తో నేరుగా నిర్ధారించుకోండి.
 
రివార్డ్ పాయింట్లు రీడీమ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి: లింక్‌పై క్లిక్ చేయించి లేదా వ్యక్తిగత/క్రెడిట్ కార్డ్ వివరాలు కోరుతూ రివార్డ్ పాయింట్లు రీడీమ్ చేసుకోమని చెప్పే మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, కాల్స్ నిజమైనవో కాదో తప్పనిసరిగా పరిశీలించండి.
 
లావాదేవీ అలర్టులు: మీ కొనుగోలు లావాదేవీలు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడానికి ప్రతి లావాదేవీకి ఎస్ఎంఎస్ లేదా యాప్ నోటిఫికేషన్‌లను ఎనేబుల్ చేయండి. ఏదైనా అనుమతి లేని కార్యాచరణను వెంటనే గుర్తించి చర్య తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
 
ఫిషింగ్ ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండండి: మీ అకౌంట్ సస్పెండ్ అయింది, పాయింట్లు/ఆఫర్లు గడువు ముగియబోతోంది, లేదా నకిలీ డెలివరీ అప్‌డేట్‌లు అంటూ వచ్చే ఈమెయిల్‌లు, సందేశాలు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. అకౌంట్ వివరాల్లో ఏ మార్పులైనా ఉంటే వాటిని అధికారిక కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడి నిర్ధారించుకోండి. నిజమైన బ్యాంకులు మరియు క్రెడిట్ కార్డ్ సంస్థలు ఎప్పుడూ గోప్యమైన వివరాలు (ఓటీపీ, సీవీవీ, పిన్, పాస్‌వర్డ్‌లు వంటివి) కోరవు.
 
డివైస్‌లు, యాప్‌లను అప్‌డేట్‌లో ఉంచండి: డివైస్ సాఫ్ట్‌వేర్‌ను నియమితంగా అప్‌డేట్ చేయడం భద్రతను బలోపేతం చేస్తుంది. మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయడం, అలాగే మీ ఫోన్, బ్రౌజర్, పేమెంట్ యాప్‌లు తాజా వెర్షన్‌లలో నడుస్తున్నాయో తెలుసుకోవడం మాల్‌వేర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అనుమతులు లేని లింకులు/సోర్సుల నుంచి యాప్‌లు ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయకండి.
 
ఎల్లప్పుడూ బలమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి: అకౌంట్ పాస్‌వర్డ్‌ను తరచుగా అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. మీ ఇమెయిల్/సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లకు భిన్నమైన, బలమైన మరియు విశిష్ట పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ ఎంచుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు.
 
గోప్యమైన సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు: కార్డ్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా సీవీవీని ఎప్పుడూ ఎవరితో పంచుకోవద్దు. ఏ కాల్, ఇమెయిల్, సందేశం వచ్చినా వాటి నిజస్వరూపాన్ని నిర్ధారించుకుని మాత్రమే ముందుకు వెళ్లండి. సోషల్ మీడియాలో ఫిర్యాదు/సందేహం తెలిపే సమయంలో మీ కార్డ్ వివరాలు లేదా ఫోన్ నంబర్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు.
 
పేమెంట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: మీ అకౌంట్‌లో ఏదైనా నిర్ధారించబడని చెల్లింపు లేదా రీఫండ్ కనిపించినప్పుడు, ఏ చర్య తీసుకునే ముందు అమౌంట్ నిజంగా క్రెడిట్ అయ్యిందా లేదా అన్నది అకౌంట్‌ని చెక్ చేసి నిర్ధారించుకోండి.
 
చెల్లింపు రంగం నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, సౌకర్యంతో పాటు జాగ్రత్త కూడా తప్పనిసరి. సమాచారం తెలుసుకుంటూ, లావాదేవీలను ధృవీకరించుకుంటూ, సురక్షిత చెల్లింపు అలవాట్లు పాటించడం ద్వారా వినియోగదారులు షాపింగ్ సమయంలో లభించే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డులు తెలివిగా ఉపయోగించినప్పుడు అసమానమైన సౌకర్యం, భద్రత, రివార్డ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఏ ప్లాట్‌ఫారమ్‌లో అయినా చెల్లింపులు చేసే సమయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కార్డుదారులకు ఎస్‌బీఐ కార్డ్ గుర్తుచేస్తోంది.
 
ఈ సులభమైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా, వినియోగదారులు ప్రశాంతంగా షాపింగ్‌ను ఆస్వాదిస్తూ, తమ క్రెడిట్ కార్డుల రివార్డ్‌లు మరియు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను భద్రంగా, సురక్షితంగా పొందగలుగుతారు.