1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Why TMC MPs may still face disqualification even if 20 or two-thirds form a bloc

టీఎంసీలో పెను ప్రకంపనలు - 20 మంది ఎంపీల షాక్ - ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది.?

mamata benerjee
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ పార్టీకి లోక్‌సభలో 28 మంది సభ్యులు ఉండగా, 20 మంది తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. పైగా, వీరంతా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నిరంకుశత్వం, అహంకార ధోరణి, మోనార్క్‌లా ప్రవర్తించడం వంటి చర్యలకు వ్యతిరేకంగా 20 మంది ఎంపీలంతా ఒక వర్గంగా ఏర్పడి ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నారు. 
 
సీనియర్ నేత, నాలుగుసార్లు ఎంపీగా గెలిచి, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న కకోలీ ఘోష్ ఈ తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత భూపేందర్ యాదవ్ నివాసంలోఈ రెబల్ ఎంపీలు సమావేశమైనట్టు తెలుస్తోంది. తమను ప్రత్యేక పార్లమెంటరీ పార్టీ గ్రూపుగా గుర్తించాలని కోరుతూ త్వరలోనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతిపత్రం సమర్పించాలని భావిస్తున్నారు. 
 
అయితే, ఈ ఎంపీల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) పరిధిలో ఉండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. చట్టం ప్రకారం అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే, పార్టీలోని మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది విడిపోవాల్సి ఉంటుంది. 
 
టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 19 నుంచి 20 మంది ఎంపీల బలం తమకు ఉన్నట్టు రెబెల్ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే, వీరంతా పార్టీ నుంచి విడిపోవడం సరిపోదని, మరో పార్టీలో విలీనం అయితేనే చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్.. తెలంగాణకు వస్తే మంచే జరుగుతుంది.. మాధవీలత