1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jagan Reddy slams CM Naidu for privatisation of medical colleges

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబును విమర్శించిన వైకాపా చీఫ్ జగన్

Jagan
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఎవరినైనా వదిలిపెట్టబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి, పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
 
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణలో కోటి మంది ప్రజలు పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. "అయినప్పటికీ మీరు ముందుకు వెళ్తున్నారు. ఇది అన్యాయం. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే అరెస్టు చేయడానికి కూడా వెనుకాడబోం. కుంభకోణాల ద్వారా ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. మీకు తగిన గుణపాఠం చెబుతారు" అని ఎక్స్  వేదికగా జగన్ పేర్కొన్నారు.
 
"మా ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. అందులో ఐదు కళాశాలలను ప్రారంభించాం, మరో మూడు కళాశాలల్లో తరగతులు మొదలుపెట్టడానికి సిద్ధం చేశాం. మిగిలిన తొమ్మిది కళాశాలలను కూడా ఏడాదికి రూ. 1,000 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టి పూర్తి చేయవచ్చు. మరి మీరు ఎందుకు అలా చేయడం లేదు?" అని జగన్ ప్రశ్నించారు.
 
"మీరు ప్రతిపాదించిన ఈ పీపీపీ ప్రణాళిక ఒక సునిశితమైన కుంభకోణం కాదా? ఇప్పటికే పూర్తయిన కళాశాలలను, నిర్మాణ దశలో ఉన్న కళాశాలలను మీరు అమ్మేస్తున్నారు. వందల కోట్ల విలువైన భూములను ఎకరాకు కేవలం రూ. 100కే లీజుకు ఇస్తున్నారు. వైద్య సీట్లలో సగానికి పైగా ప్రైవేట్ ధరలకు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రభుత్వ సొమ్ము రూ. 1,630 కోట్లను ఈ కళాశాలలకు ధారపోస్తున్నారు. అంతేకాకుండా, రెండేళ్ల పాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది జీతభత్యాలను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దీన్ని దోపిడీ కాక మరేమనాలి? ఒక్కో కళాశాలకు నెలకు రూ. 5 కోట్ల చొప్పున, రెండేళ్లకు రూ. 120 కోట్ల భారం ప్రభుత్వానికి పడుతుంది" అని జగన్ విమర్శించారు. 
 
భూమి ప్రభుత్వానిది. భవనాలను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కూడా ప్రజల సొమ్ము నుండే వస్తుంది. సిబ్బందికి జీతాలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రైవేటు సంస్థల పేరుతో జరుగుతున్న ఇది ఒక కుంభకోణం కాకపోతే, మరి ఇంకేమిటి? అని జగన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
 
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాశాలలన్నీ టీచింగ్ హాస్పిటల్స్ (బోధనా ఆసుపత్రులు) అని పేర్కొన్న ఆయన, ఇవి పేదలకు నాణ్యమైన, ఉచిత మల్టీస్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తాయని చెప్పారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Nvidia సీఈఓ జెన్సెన్ హువాంగ్ వివాహేతర సంబంధం... రూ.26 లక్షల కోట్ల నష్టం