1. ఇతరాలు
  2. »
  3. ఎన్.ఆర్.ఐ.
  4. »
  5. ప్రత్యేక వార్తలు

నేటి నుంచే "ఆటా" సభలు

నేటి నుంచే ఆటా సభలు అమెరికా తెలుగు సంఘం
అమెరికాలోని నెవార్క్ నగరంలో గురువారం నుంచి అమెరికా తెలుగు సంఘం (ఆటా) సభలు ప్రారంభం కానున్నాయి. ఆటా పదో వార్షికోత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రుడెన్షియల్ సెంటర్‌లో గురువారం రాత్రి సంప్రదాయ విందు సమావేశంతో వేడుకలు ప్రారంభమవుతాయి.

ఈ నెల 3,4,5, తేదీల్లో జరుగుతున్నఈ సభలకు రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. "దశమావతారం" పేరుతో జరుగుతున్న ఈసభ అమెరికాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు వంశీ-ఆటా అవార్డులను బహూకరించనున్నట్లు ఆటా అధ్యక్షుడు డాక్టర్ చంద్రారెడ్డి వెల్లడించారు.

సాహితీ సభల ఛైర్మన్ డాక్టర్ రవి కొండబోలు ఆధ్వర్యంలో తొమ్మిది మందిని ఎంపిక చేసినట్లు చంద్రారెడ్డి తెలిపారు. వీరిలో హ్యూస్టన్‌లో వసించే శిల్ప కోసూరి, న్యూజెర్సీకి చెందిన కాశీనాథుని మహేశ్వర ప్రసాద్, న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ నోరి దత్తాత్రేయ, డెన్వర్‌కు చెందిన డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దాముగేదల, కాలిఫోర్నియాకు చెందిన దిలీప్ కొండపర్తి, న్యూయార్క్‌కు చెందిన పరంజీలులకు ఈ అవార్డులను అందజేయనున్నట్లు ఆయన వివరించారు.

ఇకపోతే ఆటా ఉత్సవాల వివరాలకెళితే... శుక్రవారం ఉదయం జరిగే కార్యక్రమానికి మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించే సదస్సుకు ప్రముఖ న్యాయవాది షీలా మూర్తి, వాషింగ్టన్‌లో భారత కాన్సులేట్ అధికారి ఆర్. కృష్ణ తదితరులు హాజరు కానున్నారని చంద్రారెడ్డి చెప్పారు.