Madhya Ashtami: అక్టోబర్ మూడో తేదీన మధ్య అష్టమి.. పితృవులు, దుర్గాదేవిని ఇలా పూజిస్తే?
Madhya Astami
ఈ రోజున ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. దుర్గాదేవి చిత్రపటానికి లేదా విగ్రహానికి పసుపు, కుంకుమ, ఎర్రటి పువ్వులు (మందార, గులాబీ), మాలలతో అలంకరించాలి.
గణపతి పూజ చేసి ఆపై దుర్గమ్మను పూజించాలి. ఓం దుం దుర్గాయై నమః, లేదా లలితా సహస్రనామ స్తోత్రం, దుర్గా అష్టోత్తర శతనామావళితో అర్చన చేయాలి. అమ్మవారికి పాయసం, క్షీరాన్నం, గారెలు, కొబ్బరికాయ, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.
ధూప, దీప, నైవేద్యాల అనంతరం కర్పూర హారతి ఇచ్చి, కుటుంబ క్షేమం, ధైర్యసాహసాల కోసం అమ్మవారిని వేడుకోవాలి. ఈ రోజున ఉపవాసం వుండవచ్చు. అలాగే చండీ పారాయణంగా దుర్గాసప్తశతి (చండీ సప్తశతి) పారాయణం చేయడం వల్ల సమస్త భయాలు, శత్రు బాధలు తొలగిపోతాయి.
మధ్యాష్టమిని ఎలా నిర్వహించాలి?
ఇంకా పితృపక్షం కావడంతో సాధారణ శ్రాద్ధ కర్మల మాదిరిగానే పితృ పక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనిని ఇంటి యజమాని మాత్రమే చేయాలి. ఇతరులు చేయకూడదు. ఒక మంచి వేద పండితుని సహాయంతో ఈ కార్యక్రమాన్ని జరపాలి. భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించాల్సిన పితృ సంబంధిత కార్యక్రమం ఈ మధ్యాష్టమి. ఈ విధంగా ఆచరించడం వల్ల దివంగతులైన పెద్దల సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
హరిద్వార్, వారణాసి, రిషికేశ్, ప్రయాగ సంగమం, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలలో ఈ శ్రాద్ధ కర్మను నిర్వహించడం చాలా శ్రేష్ఠం. ఈ మధ్యాష్టమి నాడు శ్రాద్ధ కర్మలే కాకుండా, శివారాధన చేయడం కూడా చాలా మంచిది. వివిధ రకాల అభిషేకాలు మొదలైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తులు ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారు.
ఈ రోజున పితృ కార్యాలు నిర్వహించడం వల్ల ఆత్మశాంతి లభిస్తుందని, అలాగే తమ సంతానానికి సంపద, ఆస్తులు, వాహనాలు, ఉత్తమ ఆరోగ్యం సమకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మధ్యాష్టమి (పితృ పక్షంలోని అష్టమి) నాడు పితృ కార్యాలు నిర్వహించిన వారు, ఇదే పక్షంలోని ఇతర రోజుల్లో మళ్లీ వాటిని చేయాల్సిన అవసరం లేదు.
పితృ పక్షం చివరి రోజైన అమావాస్య నాడు కూడా చేయాలా వద్దా అనేది వారి ఇష్టానికి వదిలేయబడింది. ఎందుకంటే వారు ఈ పక్షంలోని అష్టమి నాడే పితృ దేవతలను తృప్తిపరిచి ఉంటారు. దివంగత పూర్వీకులకు తిథులు, నక్షత్రాలతో సంబంధం ఉండదు. ఈ మధ్యాష్టమి సమస్త పితృ కార్యాల ఫలితాన్ని ప్రసాదిస్తుంది.
