Hyderabad: యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్ ఘట్కేసర్లో, సుమారు ఏడాది కాలంగా ప్రేమలో ఉన్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన 22 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రురాలు ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించింది. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన దర్నాబోయిన జంగయ్య కుమార్తె ఐశ్వర్య, ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఆమె ఉప్పల్‌కు చెందిన జామ కిరణ్ కుమార్‌తో ప్రేమలో ఉంది.
ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలిపి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. మొదట రెండు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అయితే, ఇటీవల ఐశ్వర్య పెళ్లి విషయం మాట్లాడటానికి కిరణ్ కుమార్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా, వారు పెళ్లికి నిరాకరించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ ఐశ్వర్యతో మాట్లాడటం మానేసి, ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు.
నవంబర్ 17న, తనకు ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చూసుకోమని కిరణ్ కుమార్ ఆమెకు సందేశం పంపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య, తాను ఆత్మహత్య చేసుకుంటానని అతనికి మెసేజ్ చేసినప్పటికీ, అతను స్పందించలేదని ఆమె తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నవంబర్ 18న, ఐశ్వర్య తన ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆమె తల్లి శైలజకు అనుమానం కలిగింది. వెంటనే ఆమె సోదరుడు ఈశ్వర్ తలుపు పగలగొట్టి చూడగా, ఐశ్వర్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.
కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం శ్రీకార ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం మరణించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత మోసం చేసి వదిలేయడం వల్లే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

