1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Chanakya Niti: 5 Things You Should Never Reveal to Anyone

Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?

Chanakya Neeti
Chanakya Neeti
మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. అదేవిధంగా జీవితంలో విజయం సాధించాలనుకునే, శత్రువులను జయించాలనుకునే వారు ఎలాంటి యుక్తులను ఉపయోగించాలో కూడా తెలిపాడు. అలాంటి తంత్ర యుక్తులలో ఒకటి ఎవరితోనూ పంచుకోకూడని విషయాలు. ఎంత సన్నిహితులైనా కొన్ని విషయాలను మాత్రం ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎలాంటి విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉంటే జీవితంలో శత్రువులను ఓడించి విజయం సాధించవచ్చో తెలుసుకుందాం.
 
చాణక్య నీతి చెప్పే ఎవరితోనూ పంచుకోకూడని 5 విషయాలు:
ఆర్థిక నష్టం:
 మీ ఆర్థిక పరిస్థితిలో మీకు ఎదురైన లేదా ప్రస్తుతం ఉన్న క్షీణతను ఎవరితోనూ చెప్పకూడదు. అలా పంచుకోవడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసేందుకు దారితీస్తుంది. మీకు సహాయం చేయడానికి బదులు, మీ గురించి ఇతరులతో వెటకారంగా మాట్లాడి నవ్వుకోవచ్చు. కొందరు మీ స్నేహాన్నే తెంచుకునే అవకాశం ఉంది. శత్రువులు మీ బలహీనత ఏమిటో తెలుసుకుని, మిమ్మల్ని ఓడించడానికి, మీకు వ్యతిరేకంగా కుట్ర పనులకు పాల్పడే అవకాశం ఉంది. మీ సమస్యను ఇతరులతో పంచుకోవడం కంటే, ఆ ఆర్థిక ఇబ్బందిని ఎలా సరిచేయాలో ఆలోచించి పనిచేయాలి. సరైన వ్యక్తుల వద్ద దాని గురించి సలహా అడగవచ్చు.
 
బలహీనత, గందరగోళం:
 ఎవరితోనూ మీ బలహీనతలు, ఆందోళనలు, మనసులో ఉన్న గందరగోళాల గురించి పంచుకోకూడదు. అలా పంచుకోవడం వల్ల మీ ముఖం ముందు వారు సానుభూతి చూపినట్లు ఉన్నా, వెనకాల వెళ్లి మీకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మీ బలహీనతలను వారు మిమ్మల్ని సులభంగా ఓడించడానికి ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మానసిక గందరగోళాలు, ఆందోళనలను పంచుకోవడం వల్ల వాటిని కూడా వారు తమకు అనుకూలంగా మార్చుకుని, మిమ్మల్ని సులభంగా కుంగదీసే అవకాశం ఉంది.
 
కుటుంబ సమస్యలు:
కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోకూడదు. ఇది ఇంటి గౌరవాన్ని, మర్యాదను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆ సమస్యను అడ్డం పెట్టుకుని వారు ఏ విధంగా లాభం పొందవచ్చో ఆలోచించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కుటుంబంలో ఎప్పుడూ మూడవ వ్యక్తుల జోక్యాన్ని నివారించి, ప్రశాంతంగా మనమే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించాలి.
 
అవమానం- ద్రోహం: 
ఇతరులు మనల్ని అగౌరవంగా చూడటం, ద్రోహం చేయడం వంటి విషయాలను చాలా మంది తమ స్నేహితులతో పంచుకోవడం అలవాటుగా పెట్టుకున్నారు. కానీ వాటిని మీరు పంచుకున్నప్పుడు ఆ వ్యక్తికి మీపై ఉన్న గౌరవం తగ్గవచ్చు. వారి మనసులో నిజంగా మీరు అవమానానికి తగినవారేమో అనే ఆలోచనను కలిగిస్తుంది. అదేవిధంగా ఇతరులు మీకు చేసిన ద్రోహాలను మీరు చెప్పినప్పుడు, మీ అసమర్థత లేదా బలహీనతను బయటపెట్టి, మిమ్మల్ని ఇతరులు ఏయే విధాలుగా మోసం చేయవచ్చో మీరే వారికి తెలియజేసినట్లు అవుతుంది.
 
భవిష్యత్ ప్రణాళికలు, యుక్తులు:
 మీ లక్ష్యాలను, మీరు చేరుకోవాలనుకునే గమ్యాలను, వాటిని చేరుకోవడానికి మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళికలు, యుక్తులను ఎవరితోనూ పంచుకోకూడదు. మిమ్మల్ని శత్రువుగా భావించేవారు దానికి అడ్డంకులు కలిగించి, మీ లక్ష్యాన్ని నెరవేరకుండా అడ్డుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీ యుక్తులను వారు తెలుసుకుంటే, వాటిని మిమ్మల్ని ఓడించడానికి కూడా వారు ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే ఏ పనినైనా పూర్తి చేసే వరకు మౌనంగా ఉండాలి.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
17-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...