త్రిమూర్తి స్వరూపం సింహాద్రి అప్పన్న, తన్మయత్వంలో విరాట్ కోహ్లి (video)
త్రిమూర్తి స్వరూపంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని భక్తులు భావిస్తారు. ఆ స్వామి వారిని టీమ్ ఇండియా స్టార్ బ్యాట్సమన్ విరాట్ కోహ్లి దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలోని మహిమాన్వితమైన స్తంభాన్ని హత్తుకుని ప్రార్థించారు. సింహాచలం... విశాఖపట్నంకి సమీపంలో ఉంది. స్వామివారిని సాధారణంగా గంధపు పూతతో కప్పి ఉంచుతారు. ఈ పూత కారణంగా స్వామివారు శివలింగం ఆకారంలో కనిపిస్తారు. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే, అంటే వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున, ఈ గంధాన్ని తొలగించి, స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు.
సింహాచలంలో వెలసిన స్వామివారు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. శిరస్సు భాగంలో శివుడు, మధ్యభాగంలో విష్ణువు, పాదాల వద్ద బ్రహ్మ ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వామివారు రెండు రూపాల కలయికతో ఉంటారు. వరాహ రూపం మరియు నరసింహ రూపం. అందుకే స్వామిని వరాహ లక్ష్మీనరసింహ స్వామి అని కొలుస్తారు.
నిజరూప దర్శనం తరువాత, తిరిగి స్వామివారికి 12 మణుగుల గంధాన్ని పూస్తారు. ఈ ఘట్టాన్నే చందనోత్సవం లేదా చందన యాత్ర అంటారు. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ క్షేత్రం ప్రహ్లాదుని చరిత్రతో ముడిపడి ఉంది. ప్రహ్లాదుని కోరిక మేరకే నరసింహ స్వామి ఇక్కడ కొండపై వెలిశారని ప్రతీతి. ఈ దేవాలయం విశాఖపట్నానికి ఉత్తరాన ఉన్న కొండపైన, సుమారు 800 అడుగుల ఎత్తులో ఉంటుంది.