సంబంధిత వార్తలు
- ఏపీ సీఎం చంద్రబాబు కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర.. ఎందుకు?
- చంద్రబాబు కోసం బండ్ల గణేష్.. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర
- Bandla Ganesh: బీజీ బ్లాక్‌బస్టర్స్ నిర్మాణ సంస్థ ను ప్రకటించిన బండ్ల గణేష్
- ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్
- శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్కోర్ ఏమందంటే?
బాబుపై అభిమానంతో దేవుడి మొక్కు చెల్లించేందుకు వెళుతున్నా : బండ్ల గణేశ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానంతో దేవుడుకి మొక్కు చెల్లించుకునేందుకే సంకల్ప యాత్ర చేపట్టినట్టు సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. తాను చేపట్టిన ఈ సంకల్ప యాత్రకు ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఆయన అన్నారు. షాద్ నగర్‌లోని తన నివాసం నుంచి తిరుమలకు సంకల్ప యాత్ర పేరుతో బండ్ల గణేశ్ పాదయాత్రను ప్రారంభించారు.
గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి జైల్లో బంధించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ, 'ఇది రాజకీయ యాత్ర కాదు. దేవుడికి మొక్కు చెల్లించుకునేందుకు, చంద్రబాబుపై అభిమానంతో చేస్తున్నాను. దీనికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. నాకు ఉదయం 4.30 గంటలకే నిద్ర లేచే అలవాటుంది. ఆ రోజు టీవీలో చంద్రబాబు అరెస్టు వార్త చూడగానే షాక్‌కి గురయ్యాను. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడమేంటని ఆశ్చర్యపోయాను.
గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్ ఇస్తారనుకున్నాను. రాజమండ్రికి జైలుకు పంపించారు. రోజులు గడిచేకొద్దీ నాకు టెన్షన్ మొదలైంది. జైల్లో చంద్రబాబును ఏమైనా చేస్తారనే భయమేసింది. ప్రతిక్షణం ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూశాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే వార్త మొదట వినడానికే ఢిల్లీ వెళ్లి కూర్చునేవాడిని.
జైలు నుంచి ఆయన తిరిగివస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తానని ఏడుకొండలవాడిని మొక్కుకున్నా. దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత చంద్రబాబు విడుదలయ్యారు. తెలుగు ప్రజల కోసం నేనున్నానంటూ ఎంతో ఉత్సాహంతో బయటకు వచ్చారు. అలాంటి వ్యక్తి తెలుగుజాతికి చాలా అవసరం. ఈ యాత్రను రాజకీయంగా చూడొద్దు.. విమర్శలు చేయొద్దు. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు అని బండ్ల గణేశ్ అన్నారు.
