సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (22:24 IST)

నాలుగు స్థానాల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ - 13 చోట్ల సింగిల్ డిజిట్

brs flag
తెలంగాణ రాష్ట్రంలో వెలుపడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి 13 పురపాలక సంస్థలతో సరిపెట్టుకుంది. కోస్గి, ముక్తల్, ధర్మపురి, భైంసా మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. ధర్మపురిలో మొత్తం 15 వార్డులు ఉండగా, అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోస్గిలో 16 స్థానాలు ఉండగా, మొత్తం కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. 
 
ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, నందికొండ, మంథని, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 
 
116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో శుక్రవారం ఫలితాలు వెలుపడ్డాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 1,347 వార్డుల్లో విజయం సాధించి 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భారత రాష్ట్ర సమితి 717 వార్డుల్లో గెలుపొంది, 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. భారతీయ జనతా పార్టీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 
 
ఈ ఎన్నికల్లో 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా బరిలో నిలిచి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు.