తెలంగాణలో మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. అలెర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గురువారం నాడు, ఏప్రిల్ 14 వరకు వర్తించే తన ఏడు రోజుల వాతావరణ బులెటిన్‌లో, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిన తర్వాత, తెలంగాణలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అయితే, ఏప్రిల్ 10 నుండి 12 వరకు ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, జోగులాంబ-గద్వాల్, ఖమ్మం, కొమరం భీమ్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా.
ఎండకు గురికాకుండా ఉండాలని, శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని, డీహైడ్రేషన్ గురికాకుండా జాగ్రత్తపడాలని ఐఎండీ ప్రజలకు సూచించింది. దాహం వేయకపోయినా తగినంత నీరు తాగాలని, అలాగే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఓఆర్ఎస్, లస్సీ, గంజి, నిమ్మరసం, మజ్జిగ వంటి ఇంట్లో తయారుచేసుకునే పానీయాలను సేవించాలని అది కోరింది.