సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (09:25 IST)

తెలంగాణాను వీడటం లేదు.. అవన్నీ పుకార్లే : స్మితా సబర్వాల్

smitha sabharwal
భారత రాష్ట్ర సమితి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిణిగా స్మితా సబర్వాల్ చెలామణి అయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు. ఇపుడు తెలంగాణ రాష్ట్రాన్ని వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్మితా సబర్వాల్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించనున్నారని, అందువల్ల స్మితా సబర్వాల్ ఢిల్లీకి వెళ్లనున్నారే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
దీనికికారణం.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై దాదాపు వారం గడుస్తున్నా ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మాత్రం ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. కానీ, స్మిత సబర్వాల్ తీరుపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆమె డిప్యుటేషన్‌‍పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కొత్త ఛాలెంజ్‌కు సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన పోస్ట్ మరింత సంచలనానికి దారి తీసింది.
 
ఈ నేపథ్యంలో స్మిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళుతున్నానంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని, ఇవన్నీ నిరాధారమనిని స్మిత స్పష్టం చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.