ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ కొత్త మంత్రివర్గం : శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ పెద్దల మంతనాలు..

Revanth Reddy
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వారికి కేటాయించాల్సి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌లతో శుక్రవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. 
 
హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత రేవంత్, పొంగులేటి.. ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం ఒక్కరే పార్లమెంట్‌ భవనానికి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
2019లో దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. తాజా శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు గురువారం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఆయన శుక్రవారం లోక్‌‍సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. పలువురు ఎంపీలు రేవంత్‌కు పార్లమెంట్‌లో వీడ్కోలు పలికారు. తర్వాత పార్లమెంట్ నుంచి ముఖ్యమంత్రి తన నివాసానికి చేరుకున్నారు. రాత్రి 8.40 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి మాణిక్ రావు ఠాక్రే, రోహిత్ చౌదరి.. కేసీ ఇంటికి వచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు వారు మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. 
 
కీలక శాఖల్లో ఎవరికి ఏం కేటాయించాలనే దానిపై తీవ్రమైన కసరత్తు చేశారు. శాఖలు, ప్రొటోకాల్ విషయంలోనూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడడమనే అంశంపై ఎక్కువగా దృష్టిసారించినట్లు తెలిసింది. మరో ఆరుగురికి మంత్రి పదవులు కేటాయించాల్సి ఉండడంతో ఆ అంశంపైనా చర్చ కొనసాగినట్లు సమాచారం. భేటీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి, కేసీ, మాణిక్ రావు ఠాక్రే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. 
 
శాఖల కేటాయింపుపై చర్చించిన అంశాలను ఆయనకు వివరించారు. శాఖలకు సంబంధించి ఖర్గే కొన్ని మార్పులు చేర్పులను సూచించినట్లు తెలిసింది. కాసేపటికి రాహుల్ కూడా అక్కడకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేవరకు భేటీ కొనసాగింది. శాఖల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరడంతో శనివారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.