బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (08:27 IST)

ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజిగిరి - మీకు రుణపడివుంటా : సీఎం రేవంత్ రెడ్డి

revanthreddy
మల్కాజిగిరి ప్రజల వల్లే తనకు జాతీయ స్థాయి నేతగా గుర్తింపు వచ్చిందని, అందువల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ రుణపడివుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మల్కాజిగిరి ప్రజలను ఉద్దేశించి ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. 
 
'నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరిశ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది' అని పేర్కొన్నారు. 'అప్రతిహత అధికారాన్నే అస్త్రంగా చేసుకుని అణచివేతనే మార్గంగా ఎంచుకుని ప్రజలపక్షాన ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలని పాలకులు కక్ష కట్టినప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మల్కాజిగిరి నన్ను గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజిగిరి. 
 
రాజ్యం ఆదేశాలతో కొడంగల్ పోలీసు లాఠీలు నా ఇంటిపై పడి, నన్ను నిర్బంధించి నడిరాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన సందర్భాన్ని చూసి మల్కాజిగిరి చలించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ మొత్తానికి రక్షణగా ప్రశ్నించే గొంతులా నన్ను నిలబెట్టింది. ఈరోజు రేవంతన్న సారథ్యంలో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజిగిరిలోనే. 
 
నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంతటి ప్రాధాన్యముందో, మల్కాజిగిరికీ అంతే ఉంది. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత ఈ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలదే. ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో నన్ను గెలిపించారో గత ఐదేళ్లూ మీరు ఆశించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండవచ్చు. 
 
అలాంటి సందర్భంలో నా పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారు. తల్లి తన బిడ్డను దేశరక్షణ కోసం పంపినట్లు నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు. ఇన్నాళ్లు నా బాధ్యతను త్రికరణశుద్ధిగా నిర్వహించానని భావిస్తున్నాను. మల్కాజిగిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు. ఐదేళ్లే కాదు.. ఇక మీతో నా అనుబంధం, నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం' అని రేవంత్ రెడ్డి శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.