1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana Ma Ayya Jaageere : Ponnam Counters Pawan

తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?

pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చేసిన కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటరిచ్చారు. పవన్ జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ, తెలంగాణ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తు ప్రాజెక్టులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కేటాయించకపోవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ ఘర్షణను మరింత తీవ్రతరం చేసింది. 
 
తెలంగాణ ఎవరి జాగీరా కాదని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అనేది ఏ ఒక్క వ్యక్తికో లేదా రాజకీయ పార్టీకో చెందినది కాదని, అది ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజలకు చెందినదని ఆయన స్పష్టం చేశారు. అవును.. తెలంగాణ మా అయ్య జాగీరే, మీ అయ్య జాగీరు కాదని పొన్నం అన్నారు. పవన్ వ్యాఖ్యలు అహంకారాన్ని ప్రతిబింబిస్తున్నాయని పొన్నం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ పట్ల ఎందుకు అంతటి ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
కేవలం కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం పవన్‌ను ఒక అతిథిగా సాదరంగా ఆహ్వానించిందని కూడా ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో రాజకీయంగా పవన్ అసలు ఏమి సాధించాలనుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన పవన్‌కు సూచించారు.
 
 
మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో పొత్తు అవసరం లేదని పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
 
అయితే, ఏపీ రాజకీయాల మాదిరిగా తెలంగాణ రాజకీయాల్లో జనసేన నిలబడడం అంత సులభం కాదు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అనేక సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి మూడు పెద్ద పార్టీలతో పాటు కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేనతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది.
 
తెలంగాణలో స్థానిక సమస్యలు, అభివృద్ధి, అన్యాయాలపై పోరాడతామని పవన్ అన్నారు. అయితే, స్వతంత్రంగా నిలబడడం మూడు పెద్ద పార్టీలతో తలపడడం అంత ఈజీ కాదు. ఆంధ్రా నాయకుడిగా పవన్‌కు ముద్రపడింది. అందులోనూ అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉన్నారు. 
 
కాబట్టి, పవన్‌ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవడం కష్టం. తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రా నేపథ్యం కారణంగా పవన్ వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆంధ్రాలో కూడా జనసేన సంస్థాగతంగా బలపడాల్సి ఉంది. ఇక తెలంగాణలో అయితే జనసేనకు ఉన్న సంస్థాగత బలం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
About Writer
సెల్వి