నిన్న నమిత.. నేడు నయనతార... తమిళ రాజకీయాల్లోకి తారలు... జయలలితవైపే మొగ్గు....?
తమిళ చిత్ర పరిశ్రమకు, ఆ రాష్ట్ర రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కూడా తారగా ఒక నాడు ఏలిన వారేనన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకాకుండా, గతంలో కూడా పలువురు ముఖ్యమంత్
తమిళ చిత్ర పరిశ్రమకు, ఆ రాష్ట్ర రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కూడా తారగా ఒక నాడు ఏలిన వారేనన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకాకుండా, గతంలో కూడా పలువురు ముఖ్యమంత్రులుగా పని చేశారు.
ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు శాసనసభ్యులు, లోకసభ సభ్యులు, మంత్రులుగా ప్రజాసేవలో రాణిస్తున్నారు. మరికొందరు రాజకీయ దాహంతో ఉన్నారు. నిన్నగాక మొన్న నటి నమిత అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. అలాగే, మరో సీనియర్ నటి ఖుష్బూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
తాజాగా ఇటు తెలుగు, అటు తమిళంలో నంబర్‌వన్ నాయకిగా వెలుగొందుతున్న నయనతారకు రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కోరిక కలిగింది. పలు ఎదురు దెబ్బలను తట్టుకుని నటిగా అగ్రస్థానంలో రాణిస్తున్న నయన్ బాణీనే వేరు. ఎవరేమనుకున్నా, తనకంటూ ఒక పాలసీని ఏర్పరచుకుని ఆ దారిలో పయనిస్తున్న ఈ సంచలన నటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో చాపకింద నీరులా నయన తన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అధికార పార్టీ నయనను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రచారానికి తెర లేచింది. ఇటీవల అధికార పార్టీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అదీ ఒక తారగా తళుకుబెళుకు దుస్తులతో ఎలాంటి హంగామా లేకుండా, పూర్తిగా కట్టుబొట్టు మార్చి సాదాసీదాగా రావడంతో అక్కడ ఉన్న వాళ్లే గుసగుసలాడుకోవడం విశేషం. దీంతో నయనతార రాజకీయరంగ ప్రవేశానికి వేళాయే అనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

