1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. RBI proposes trusted approver, stop switch to curb digital fraud

డిజిటల్ బ్యాంకింగ్ మోసాల కట్టడిపై ఆర్బీఐ దృష్టి... సరికొత్త ఫీచర్‌తో చెక్!

online fraud
ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ మోసాలను అరికట్టేందుకు భారత రిజర్వు బ్యాంకు ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఖాతాదారులే స్వయంగా తమ ఖాతా నుంచి నిధుల బదిలీని తక్షణమే నిలిపివేసేలా 'స్టాప్ స్విచ్' సదుపాయాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అందించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
 
'కస్టమర్ ప్రొటెక్షన్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్' సవరించిన నిబంధనల ముసాయిదాలో భాగంగా ఈ కీలక మార్పులను తీసుకొచ్చారు. అనధికార లావాదేవీలు జరిగినప్పుడు ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయడమే కాకుండా, అసలు మోసాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు ఈ ప్రతిపాదనలు ఉపయోగపడతాయని ఆర్బీఐ పేర్కొంది.
 
ఖాతాదారుడు సైబర్ మోసానికి గురవుతున్నట్లు గుర్తించిన వెంటనే ఈ 'స్టాప్ స్విచ్' ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఇది యాక్టివేట్ కాగానే సదరు ఖాతా నుంచి భవిష్యత్తులో బయటకు వెళ్లాల్సిన అన్ని రకాల డెబిట్ లావాదేవీలు తక్షణమే నిలిచిపోతాయి. అయితే, ఇప్పటికే ఇచ్చిన రికరింగ్ పేమెంట్స్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, లోన్ల ఈఎంఐలు, బ్యాంకు ఛార్జీల వసూళ్లు వంటి వాటికి మాత్రం ఈ స్టాప్ స్విచ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
 
కాగా, ఈ ముసాయిదా మార్గదర్శకాలు 2027 జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు సిద్ధంగా ఉంటే అంతకంటే ముందుగానే ఈ మార్గదర్శకాలు అమలు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 24, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?