1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Bomb Hoax Names Amitabh Bachchan's Home After Bulletproof Glass Upgrade

అమితాబ్ జల్సాకు బాంబు బెదిరింపులు.... ఉత్తుత్తివేనని తేల్చిన స్క్వాడ్

Amitabh Bachchan Home Jalsa
బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్‌ నివాస జల్సాతో పాటు ముంబై నగర మేయర్ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఈమెయిల్ వచ్చింది. ఈ ఈమెయిల్స్ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సమాచారం అందిన వెంటనే ముంబై భద్రతా సంస్థలు, బాంబు నిర్వీర్య బృందాలు రంగంలోకి దిగాయి. పేర్కొన్న అన్ని ప్రాంతాలలోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో, ఇది ఆకతాయిలు పంపిన నకిలీ (హోక్స్) ఈమెయిల్ అని అధికారులు తేల్చారు. 
 
గత కొద్ది రోజులుగా ముంబైలో ఇటువంటి నకిలీ బెదిరింపు ఈమెయిళ్లు వరుసగా వస్తున్నాయి. నవంబరు 6వ తేదీ కూడా అమితాబ్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ బెదిరింపు రాగా, తనిఖీల్లో ఏమీ దొరకలేదు. అంతకుముందు అక్టోబరు 23వ తేదీ ముంబై మేయర్, డిప్యూటీ మేయర్లకు వచ్చిన ఈమెయిల్లో బీఎంసీ ప్రధాన కార్యాలయం, జల్సా బంగ్లా, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ కచేరీ వేదిక, ఒక పాఠశాలపై దాడులు చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ పేర్లతోనూ ఇలాంటి హెచ్చరికలే వచ్చాయి.
 
ఇటీవల 84 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన నివాసం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి అభిమానులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే తాజా బెదిరింపు రావడం గమనార్హం. ప్రస్తుతం పేర్కొన్న ప్రాంతాలలో ఎలాంటి ముప్పు లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయా ప్రదేశాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు, ఈ బెదిరింపు మెయిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ముంబై సైబర్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దేశంలోనే తొలిసారి - ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ మెడికల్ కోర్సు