ఏపీకి పెట్టుబడుల వివరాలు లీక్ - 15 అధికారులపై సీఎం విజయ్ సర్కారు కొరఢా
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వివరాలను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళ్లేలా కీలక సమాచారాన్ని లీక్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటన్న 15 మంది సీనియర్ అధికారులపై ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ అధికారులపై కొరఢా ఝుళిపించింది. ఇందులోభాగంగా, 15 మంది అధికారులను విధుల నుంచి తొలగించింది.
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ 'గైడెన్స్ తమిళనాడు'లో పనిచేస్తున్న ఈ అధికారులపై అంతర్గత దర్యాప్తు అనంతరం వేటు వేసినట్లు సమాచారం. తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం జరిపిన చర్చలు, ఒప్పందాలు, సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకు చేరవేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
విధుల నుంచి దూరం పెట్టిన వారిలో ఎక్కువ మంది 2016-2021 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. పాలనాపరమైన కొనసాగింపు కోసం గత డీఎంకే ప్రభుత్వం కూడా వీరి సేవలను వినియోగించుకుంది. అయితే, తాజాగా తొలగించిన అధికారుల్లో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో చేరుతుండటం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తమిళనాడుకు రావాల్సిన కొన్ని భారీ ప్రాజెక్టులు ఏపీకి మళ్లడానికి ఈ లీకేజీలే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఎలాంటి సమాచారం బయటకు వెళ్లిందనే దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ఆధారాలను బయటపెట్టలేదు.
ఈ పరిణామం తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. విజయ్ ప్రభుత్వ చర్యను డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. డీఎంకే ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన టి.ఆర్.బి.రాజా స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత అపరిపక్వమైనదని విమర్శించారు. కేవలం సోషల్ మీడియా రాజకీయాల కోసమే, దశాబ్దాలుగా నిర్మించిన అత్యున్నత వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అనుభవజ్ఞులైన అధికారులను కొనసాగించి పారిశ్రామిక ప్రగతిని సాధించిందని, ప్రస్తుత పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు.

