ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వ హయాంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ, ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన వీసీగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, కుమార్తెకు అక్రమంగా ఎంటెక్‌లో ప్రవేశం కల్పించడంత నియామకాలు - ప్రవేశాల్లో యధేచ్చగా ఉల్లంఘనలు, సివిల్ పనుల్లో అవకతవకలతో పాటు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్, విచారణ కమిటీల నివేదికల్లో తేలింది. వీటి ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశారు. జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సివుండగా, తన రిటైర్మెంట్ ఆఖరి రోజున సస్పెండ్‌కు గురయ్యారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి పనిచేశారు. ఆ సమయంలో అనేక అరాచకాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు ఆయన అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిఫారసు చేసింది. ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది.
ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో దాదాపు వైకాపా కార్యకర్తలా పనిచేశారు. యూనివర్సిటీని వైకాపా కార్యాలయంలా, రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారన్న విమర్శలు వచ్చాయి. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే వైకాపా కార్పొరేటర్ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు ప్రచార వ్యూహాలన్నీ వీసీ కార్యాలయం కేంద్రంగానే నడిచాయని, విద్యార్థులతో సర్వేలు చేయించారని ఆరోపణలు వచ్చాయి.
