Summer: వేసవిలో భానుడు భగభగ.. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
వేసవి తీవ్రత ఈ ఏడాది ఎక్కువగా వుంటుందని.. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మార్చి నెల నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో శ్రీకాకుళం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలమని ఆయన తెలిపారు.
