గొడ్డలి పార్టీ నేతలు రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండాలి : కూటమి శ్రేణులకు సీఎం బాబు పిలుపు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, అయితే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ నేతలు రెచ్చగొడతారని, అందువల్ల కూటమి నేతలు, శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా చేసుకుని కూటమి నేతలు కృషి చేయాలని ఆయన కోరారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కూటమి పార్టీల ముఖ్యనేతలు, కేడర్‌తో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, గతంలో జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇంతటి స్ఫూర్తి కనిపించలేదని సీఎం తెలిపారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారని, మరికొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉందని చెప్పారు.
ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని, వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని, కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

