రాబోయే 24 గంటల్లో మరో తుఫాను.. మంగళవారం వరకు భారీ వర్షాలు
రాబోయే 24 గంటల్లో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) శనివారం ఉదయం జారీ చేసిన ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. ఈ బులెటిన్ ప్రకారం, శుక్రవారం దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది.
శనివారం ఉదయం 8:30 గంటలకు ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాలపై స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా నెలకొని ఉంది.
ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, రాబోయే ఆరు గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది.
ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, 2026 నవంబర్ 2 సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది.
అందువల్ల మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
అధికార యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

