శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి కలకలం సృష్టించినట్టు వార్తలు వస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో తిరుమలతో పాటు శ్రీశైలానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు అనుమానాల వ్యక్తమవుతున్నాయి. గత 2022 మే నుంచి 2023 మార్చి నెల వరకు శ్రీశైలం ఆలయానికి నెయ్యిని రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ కాంట్రాక్ట్ కింద సరఫరా చేసింది. అయితే, విజయ డైరీని కాదని రాజేష్ కార్పొరేషన్‌కు గత ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఏదో మతలబు ఉందనే సందేహం వ్యక్తమవుతోంది.
నిజానికి రాజేష్ కార్పొరేషన్‌కు సొంతంగా ఎలాంటి పాల డైరీ లేదు. దీంతో బోలో బాబా నెయ్యినే రాజేష్ కార్పొరేషన్ కొనుగోలు చేసి శ్రీశైలం దేవస్థానానికి కూడా సరఫరా చేసింది. అయితే, శ్రీశైలం ఆలయంలో మాత్రం కల్తీ నెయ్యి వాడినట్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌తో అధికారులు తనిఖీలు చేయించడం లేదు.
మే 2022 నుంచి మార్చి 2023 వరకు 11 నెలల పాటు 3,25,064 కేజీల నెయ్యిని రాజేష్ కార్పొరేషన్ శ్రీశైలం ఆలయ ప్రసాదాల తయారీకి సరఫరా చేసింది. అయితే, ఇపుడు తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ, శ్రీశైలం ఆలయ అధికారులు మాత్రం రాజేష్ కార్పొరేషన్ సరఫరా చేసిన నెయ్యిని మాత్రం తనిఖీ చేయించే విషయంలో ఏమాత్రం నోరు మెదపడం లేదు.