పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మేకపాటి ఫ్యామిలీ?
Jagan_Mekapati Family
వైసీపీ అధికారంలోకి వచ్చాక, నెల్లూరు జిల్లా కీలక నేతగా ఉన్న మేకపాటిని జగన్ పెద్దగా పట్టించుకోలేదని టాక్. ఇంకా దీనిపై అసంతృప్తితో ఆయన ఇటీవల జగన్ కోటరీపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ, జగన్ నుంచి పిలుపు రాకపోవడంతో, పార్టీలో కొనసాగడం కంటే బయటకు వెళ్లడమే మేలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
మేకపాటి రాజమోహన్ రెడ్డికి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత రాజకీయ అనుబంధం ఉన్నట్లు ఆయన రాజకీయ ప్రస్థానం చెబుతోంది. ఆ అభిమానంతోనే ఎంపీ పదవిని సైతం వదులుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. అనంతరం వైఎస్ జగన్ కూడా మేకపాటి కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది.
అయితే ఆయన అకాల మరణంతో కుటుంబానికి పెద్ద విషాదం ఎదురైంది. ఆ తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అయితే ఆ కుటుంబానికి ఆ స్థాయిలో మరిన్ని కీలక రాజకీయ అవకాశాలు దక్కలేదనే అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారానికి మరో కారణం కూడా తెరపైకి వచ్చింది. రాజ్యసభ పదవితో పాటు భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కుటుంబ వారసులకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామనే హామీలు లభించడంతోనే పార్టీ మారే ఆలోచనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
